నెలలకు ఆయాలకు వేతనాలు నిల్
ఉద్యోగ భద్రతపైనా స్పష్టత కరువు
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి
మున్సిపల్స్ స్కూల్స్ ఆయాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం క్షేత్రస్థాయి కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాలు అమలు చేస్తున్న విషయం విధితమే. దీనిలో భాగంగా మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖలో ఏప్రిల్‌లో విలీనం చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరాలు చెప్పినప్పటికీ విద్యా వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామంటూ సమాధానం ఇచ్చింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మున్సిపల్ స్కూల్స్‌లో దశాబ్ధాల కాలంగా పనిచేస్తున్న ఆయాల (కంటింజెంట్ కార్మికులు)ను విస్మరించింది. దీతో గత నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కావటంలేదు. దీంతో ఆయాల పరిస్థితి దయనీయంగా మారింది.
శాఖల మధ్య సమన్వయ లోపం
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఆయాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాజమహేంద్రవరంలో 64 మంది, కొవ్వూరులో ఐదుగురు, నిడదవోలు మున్సిపాల్ స్కూల్స్‌లో మరో ఐదుగురు మొత్తం 74మంది ఆయాలు పనిచేస్తున్నారు. అత్యధిక మంది నాలుగు దశాబ్ధాలుగా విధులు నిర్వహిస్తున్న వారున్నారు. ప్రభుత్వం వీరికి రూ.4వేలు మాత్రమే వేతనం చెల్లిస్తోంది. అయినప్పటికీ స్కూల్స్‌పైనే ఆధారపడి వారు ఉపాధి పొందుతున్నారు. మే నుంచి కార్మికులకు వేతనాలు విడుదల చేయట్లేదు. దీంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం చెప్పాలంటూ కార్మికులు ఆందోళనలు చేపట్టారు.
పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర
మున్సిపల్ స్కూల్స్‌లలో పనిచేస్తున్న ఆయాలు అత్యధిక మంది దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగుతలకు చెందిన వారున్నారు. దశాబ్ధాల కాలంగా పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో చిన్నపిల్లల అవసరాలను తీర్చుతూ పర్యవేక్షిస్తున్నారు. తరగతి గదులను శుభ్రం చేయటం, మొక్కల సంరక్షణ తదితర బాధ్యతలు నిర్వరిస్తున్నారు. 1985లో నెలకు రూ.5లకు విధుల్లోకి చేరి ఇప్పటికీ పనిచేస్తున్నావారున్నారు. అటువంటి వారిని ప్రభుత్వం విస్మరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మెన్‌లు, ఆయాల నియామకం కూడా చేపట్టడం ఉద్యోగ భద్రతపై నీలి నీడలు కమ్ముతున్నాయి.
ఉద్యోగ భద్రత కల్పించాలి
జిల్లాలో 74 మంది ఆయాల భవిష్యత్తు ప్రశ్నార్ధకం మారింది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించేలా నిర్ణయం తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయాలి. కార్మికులు ఫుల్ టైం పనిచేస్తున్నా పార్ట్‌టైం కార్మికులుగానే వేతనాలు చెల్లించారు. కంటింజెంట్ కార్మికులు (ఆయా)లను ఫుల్ టైం కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనం రూ.12,000 చొప్పున వేతనాలు చెల్లించాలి.
- వై ఝాన్సీ, మున్సిపల్ స్కూల్ ఆయాల సంఘం జిల్లా అధక్షులు
అద్దె ఇళ్లలోనే జీవనం
30 ఏళ్లుగా స్కూల్ ఆయాగా పనిచేస్తున్నాను. అద్దె ఇంటిలో జీవిస్తున్నాను. నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను. భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలున్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వేతనాలు విడుదల చేయకపోవటంతో నేను కూడా వారిపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రభుత్వం తక్షణమే బకాయిలు వేతనాలు చెల్లించాలి.
- గురుబిల్లి రమణ మున్సిపల్ స్కూల్ ఆయా సీతం పేట
రూ.5 వేతనం నుంచి చేస్తున్నాను.
40 సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్నాను. తొలి నెలలో రూ.5 వేతనం ఇచ్చారు. ఎప్పటికైనా పర్మినెంట్ చేస్తారని ఆశపడ్డాను. పర్మినెంట్ చేయలేదు. ఇప్పుడు అసలు వేతనమే ఇవ్వటంలేదు. ఇలాగైతే ఎలా బతకాలి. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి భరోసా ఇవ్వాలి.
- గండి సోమాలమ్మ మేదరపేట మున్సిపల్ స్కూల్










