ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
స్థానిక ఆనం కళాకేంద్రంలో భారత్‌రంగ్ మహోత్సవ్-2023 ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ అఫైర్స్ సంచాలకులు అభిలాష్ పిళ్లై హాజరయ్యారు. ప్రొఫెసర్ డాక్టర్ అభిలాష్ పిల్లే, వీణ శర్మ, మల్లికార్జునరావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిళ్లై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. భారతీయ సంస్కతి సంప్రదాయలను ప్రపంచానికి తెలియజేయడంలో నాటకరంగానిది ప్రముఖమైన పాత్ర అన్నారు. నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందన్నారు. ఈ రంగంలో ఉన్న కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఎన్‌ఎస్‌డి సెంటర్ డైరెక్టర్ వీణ శర్మ మాట్లాడుతూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రపంచంలోనే అగ్రగామి థియేటర్లు శిక్షణ సంస్థల్లో ఒకటి అన్నారు. భారత ప్రభుత్వ సాంస్కతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. ఎన్‌ఎస్‌డిలో నసీరుద్దీన్ షా, ఓం పురి, అనుపమ కేర్, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధికి, వంటి ప్రముఖ భారతీయ చలనచిత్రాల నటులు తర్ఫీదు పొందినవారేనన్నారు. రాజమహేంద్రవరంలోనూ ఈ శాఖను ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. సాంస్కతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రదర్శనలను ఇక్కడ ఇవ్వడం అభినందనీయమన్నారు. తొలి రోజు తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ గ్రూప్‌వారు 'భక్త ప్రహ్లాద' నాటకాన్ని ప్రదర్శించారు. సోమవారం కర్ణాటక రాష్ట్ర మంగుళూరుకు చెందిన అస్థిత్వ థియేటర్ గ్రూప్ 'కొండోనియన్స్' నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సెంటర్ ఇన్‌ఛార్జి భూపతి, డిఇఒ ఎస్.అబ్రహాం, డిప్యూటీ డిఇఒ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










