Sep 04,2023 23:12

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ప్రజలపై ధరల భారాలు మోపడంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ పోటీపడుతున్నారని సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ ధ్వజమెత్తారు. సోమవారం రాజమహేంద్రవరం సబ్‌ -కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో సమర భేరి పేరుతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టి.అరుణ్‌ మాట్లాడుతూ కోట్లాది మంది కార్మికులకు వేతనాలు పెరగక, నూతన ఉద్యోగాలు రాక ధరలు, ఛార్జీల భారాలతో సామాన్యులు నలిగిపోతున్నరని, ప్రజలకు విద్యుత్‌ బిల్లు ముంటుకుంటేనే షాక్‌ కొట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను ఎడాపెడా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని విమర్శంచారు కోట్లాది మంది కార్మిక వర్గానికి గత 10 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు. కనీస వేతనం రు.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా చదుకువుకున్న యువతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చేనాటికి వంట గ్యాస్‌ రు 350 ఉంటే 9 ఏళ్ళ కాలంలో రు.1,200 కు పెంచారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో కంటి తుడుపుగా రూ.200 తగ్గించారాని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సగానికి తగ్గినా దేశంలో ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌పై అసలు ధరకంటే మూడు రెట్లు పన్నులు వేసి ప్రజలను పీల్చుకుని తింటున్నారని విమర్శించారు. ఇందన ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగి, సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు ప్రజలపై పన్నుల భారలు వేస్తూ మరో వైపు అంబానీ, ఆధానీలకు పన్నుల రాయితీ, అప్పులు రద్దు చేస్తూ ప్రజల సంపదను దోచిపెడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో మోడీ అనుంగ శిష్యుడిగా ప్రజలపై, 4 ఏళ్ళ కాలంలో 8 సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టారని ఎద్దేవా చేశారు. మోడీ ప్రతిపాదిస్తున్న విద్యుత్‌ సంస్కారణల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రజలపై అదనంగా ట్రూ- ఆఫ్‌, సర్దుబాటు 1, సర్దుబాటు 2, ఫిక్సిడ్‌ ఛార్జీల పేరుతో రెట్టింపు బిల్లులు వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఉపశమహరించుకొనకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్ర ప్రజలపై జగన్‌ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసే చెత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాష్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, టి.సావిత్రి, నాయకులు పడాల.రామకష్ణ, ఐ. సుబ్రహ్మణ్యం, ఎస్‌.మాచారావు, సోమేశ్వరావు, వై. బేబీ రాణి, వెంకటలక్ష్మి, ఆనంద్‌, జరీనా షరీఫ్‌, రాజా, రాంబాబు, వి.రాము తదితరులు పాల్గొన్నారు. చాగల్లులో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సిపిఎం శాకా కార్యదర్శి కెకె.దుర్గారావు పాల్గొని మాట్లాడారు. తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జి.సుబ్బారావు, కె.బుద్ధుడు, జె.శ్రీను పాల్గొన్నారు. కొవ్వూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. సిపిఎం నాయకులు పి.గంగాధరరావు మాట్లాడారు. నాయకులు ఎం.వీరబాబు, కె.కనకారావు, షేక్‌ మీరా సాహెబ్‌, బీరా రవి, తాతా రాంబాబు పాల్గొన్నారు. తాళ్లపూడిలో బస్టాండ్‌ సెంటర్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ బైకుర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా నాయకులు ఎం.సుందర్‌బాబు పాల్గొని మాట్లాడారు. వి.నరసింహమూర్తి, సుంకర వెంకటేశ్వరరావు, ఉప్పే కేదార్‌, సత్తిబాబు, ఎస్‌.సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. డానియేల్‌, ప్రసన్నకృష్ణ, బేబి, లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.