ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం చేపట్టిన బస్‌యాత్ర(సమరయాత్ర 2.0)ను జయప్రదం చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చాయి. శుక్రవారం నగరంలోని శ్యామలాసెంటర్‌లో ప్రజాసంఘాల కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకుల సమావేశం జరిగింది. పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి ఎస్.కిరణ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.సునీల్, డివైఎఫ్‌ఐ నాయకుడు టి.రాజేష్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు తారకేశ్, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు మాట్లాడారు. 2014 ఫిబ్రవరి 24న పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు భవిష్యత్ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపైనే ఆధారపడి ఉందన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం సమయంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అమలు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పకోడీలు, బండ్లు వ్యాపారాలు, సిమ్స్ అమ్ముకోవడం కూడా ఉపాధి చూపడమే అని అనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు కర్మగారాన్ని అమ్మేందుకు కుట్ర చేశారన్నారు. భావప్రకటన స్వేచ్ఛ హరించేలా ముఖ్యమంత్రి జిఒ 1 తెచ్చి ప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించారన్నారు. జగన్ అధికారంలోకొచ్చి నాలుగేళ్లు అవుతున్నా రాష్ట్ర హక్కుల కోసం కనీసం మాట్లాడటంలేదన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు మంజూరవుతాయన్నారు. అదే ప్యాకేజీ ఇస్తే 70శాతం రుణాలు తిరిగి చెల్లించాల్సి వస్తుందన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి ,రాయలసీమ అభివృద్ధి, విశాఖ మెట్రో, కడప ఉక్కు పరిశ్రమ, రాజధానికి నిధులు, పోలవరం ప్రాజెక్ట్ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు, గిరిజన, పెట్రో, వైద్య యూనివర్సిటీల కోసం, భావితరాల భవిషత్తు కోసం చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 31న రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. ఫిబ్రవరి 1న ఉదయం బస్ యాత్ర రాజమండ్రిలో సభ ముగించుకుని ముందుకు సాగుతుందన్నారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు.










