Apr 11,2023 23:57

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులు

గోడపత్రికను ఆవిష్కరించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీల పిలుపు మేరకు ఏప్రిల్‌ 14 నుంచి 30 వరకు ప్రచార భేరి కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం నగరంలోని శ్యామల సెంటర్లో సిపిఎం, సిపిఐ నాయకులు ప్రచార భేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమా మహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి టి.మధు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం గద్దెనెక్కాక ప్రజలపై సర్జికల్‌ దాడి మొదలెట్టిందన్నారు. బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల, ప్రయివేటీకరణ విధానాలను అనుసరిస్తుంద న్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులు హరిస్తుందన్నారు. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తుందని, ప్రజల ఆస్తులను అదానీ, అంబానీలకు కట్టబెడుతుందన్నారు. ఇలాంటి విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎంలు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచారం చేపట్టాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న బారాలకు రాష్ట్రం వంత పాడుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిపి రాష్ట్ర ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారభేరిలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.పవన్‌, పి.తులసి, బి.రాజులోవ, ఎం.సుందర్‌బాబు, జె.రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, ఎ.రామకృష్ణ, బి.భద్రరావు పాల్గొన్నారు.