Feb 25,2023 22:58

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి బాలలు సమాజ సంపద. సమాజం యొక్క ఆస్తి. ఆ ఆస్తి సమాజభివద్ధికి దోహదపడేలా వినియోగిద్దాం. బాలల ఆసక్తి.. అభిరుచులకు ప్రాధాన్యత ఇద్దాం. వారిలో దాగిఉన్న సజనాత్మకతను వెలికితీద్దాం. వారిలో దాగివున్న ప్రతిభను సమజానికి చాటుదాం' అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. చారిత్రక, సాంస్కతిక రాజధాని రాజమహేంద్రవరం నగరంలో రెండు రోజులపాటు జరుగుతున్న 'గోదావరి బాలోత్సవం' మొదటి పిల్లల పండుగ శనివారం బాలల ఆటలు.. పాటలు..నత్యాలు, కేరింతల మధ్య ఎంతో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. గోదావరి బాలోత్సవం ప్రారంభ సూచికగా జాతీయ పతాకాన్ని ఎంఎల్‌ఎ షేక్‌ సాబ్జి ఆవిష్కరించారు. గోదావరి బాలోత్సవం పతాకాన్ని చిన్నారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సీనియర్‌ జర్నలిస్టు వివిఎస్‌ కష్ణకుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మాట్లాడుతూ గోదావరి బాలోత్సవం ద్వారా సాంస్కతిక రాజధాని రాజమహేంద్రవరం మొదటి పిల్లల పండుగను నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. బాలలు సమాజ సంపద అని, ఆ ఆస్తి సమాజ ప్రయోజనాలకు ఉపయోగపడాల్సి ఉందన్నారు. బాలల రూపంలో ఉన్న మానవవనరులను భవిష్యత్‌ సమాజానికి సద్వినియోగం చేసేలా ఇప్పటి నుంచే వారిలో ఆలోచన శక్తిని పెంపుదల చేసేందుకు దృష్టి సారించాల్సిన ఆవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజం సెల్‌ఫోన్‌ ప్రపంచంలో బాల్యం శిథిలమైపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాలల్లో ఉన్న ఆలోచనా శక్తిని, వారిలో దాగివున్న సజనాత్మకతను, వారికున్న ఆసక్తిని, అభిరుచులను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా బాలోత్సవాలను నిర్వహిస్తున్నామని, కొత్తగూడెంలో నిర్వహించిన బాలోత్సవం స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. సమాజ ప్రయోజనాల కోసం ముఖ్యంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ విద్యను అందించాలన్నా లక్ష్యంతో యావదాస్తిని సమాజానానికి ధారాదత్తం చేసిన కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మిలకు చెందిన ఎస్‌కెవిటి కళాశాలలో బాలోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. సమాజ ప్రయోజనాల కోసం పాటుపడటం పక్కకుపోయి, సమాజం నుంచి ఎంత సంపాదించాలనే రోజుల్లో ఉన్న సమాజంలో బతుకుతున్నామని, ఇటువంటి సమాజం మార్పు చెందాలంటే చిన్ననాటి నుంచే బాలల్లో సమాజహితం కోసం ఆలోచించేలా శిక్షణ అవసరమని, అందుకు బాలోత్సవాలు దోహదం చేస్తాయన్నారు. బాలలు నిత్యం ఆడాలి.. పాడాలి. గెంతాలి.. అని ఆలోచిస్తారని, అయితే నేటి విద్యావ్యవస్థ విద్యార్థులను ఏవో భ్రమలవైపు, బ్రాంతిలోకి తీసుకెళుతోందనిఅమరావతి బాలోత్సవం నిర్వాహకులు మురళీకష్ణ అన్నారు. విద్యార్థుల ఆసక్తిని తెలుసుకుని ప్రోత్సహించేలా తల్లిదండ్రులతోపాటు, ఉపాధ్యాయులు ప్రత్యేక దష్టి సారించాల్సిన ఆవసరం ఉందన్నారు. దారి తప్పిన విద్యావ్యవస్థను సన్మార్గంలో పెట్టేందుకు అవసరమైన రీతిలో చైతన్యం తీసుకొచ్చేందుకు దోహదం చేసేలా బాలోత్సవాల నిర్వాహణ జరుగుతుందన్నారు. బాలోత్సవ ఉద్యమం మహోద్యమంగా ముందుకు సాగాలని, అందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిసిపి ఎండి పంతం కొండలరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒక్కటే కాదని, అన్ని అంశాలపైనా అవగాహన అవసరమన్నారు. కార్పొరేట్‌, ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం ర్యాంకులపైనే దష్టి సారిస్తున్నాయని, అలాకాక విద్యార్థుల్లో ఉన్న సజనాత్మకతను వెలికితీసేందుకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎ రాజబాబు, ఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథరావు, ఆలపాటి నాగేశ్వరరావు, డాక్టర్‌ తలారి వాసు, డాక్టర్‌ చైతన్య శేఖర్‌, పి.తులసి, తాడూరి శ్రీనివాస్‌, సూర్యనారాయణ, జివిఎల్‌ నరసింహరావు, ఖాదర్‌ఖాన్‌, సూర్యనారాయణ, గౌరి, శ్రీనివాస్‌, రఘునాథ్‌ పాల్గొన్నారు.
బాలోత్సవ్‌లో చిన్నారుల సందడి
గోదావరి బాలోత్సవానికి శ్రీ కందుకూరి వీరేశలింగం డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్‌ వేదికగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 4000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకడమిక్‌- కల్చరల్‌ రెండు విభాగాలుగా కార్యక్రమాలు జరిగాయి. బాలోత్సవ్‌ నిర్వహణకు ఐదు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రజానాట్యమండలి వ్యవప్థాపకులు గరికపాటి రాజారావు వేదికపై జానపద నృత్యాల పోటీలు జరిగాయి. ప్రముఖ నటులు ఎస్‌వి.రంగారావు వేదికపై ఫ్యాన్సీ డ్రస్‌ విచిత్ర వేషధారణ పోటీలు జరిగాయి. ప్రముఖ గాయకులు ఎస్‌పి బాలు- వాణి జయరాం వేదికపై జానపద పాటలు, అభ్యుదయ దేశభక్తి గేయాలను చిన్నారులు ఆలపించి అలరించారు. దర్శక రత్న కె.విశ్వనాద్‌ పేరుతో ఏర్పాటు చేసిన మరో వేదికపై క్లాసికల్‌ డ్యాన్స్‌ పోటీలు జరిగాయి. ప్రజా కళల దర్శకుడు పిజె రామనాధం వేదికపై లఘునాటిక, ఏకపాత్రాభినయం పోటీలు చిన్నారుల ప్రతిభకు దర్పణం పట్టాయి. ప్రారంభ సభ అనంతరం పోటీలు ప్రారంభం అయ్యాయి. అకడమిక్‌ విభాగంలో చిత్రలేఖనం, స్పాట్‌ డ్రాయింగ్‌, కథా రచన, వ్యాసరచన తెలుగు, ఇంగ్లీషు, వ్యక్తృత్వం తెలుగు, ఇంగ్లీషు, మ్యాప్‌ పాయింటింగ్‌, బెస్ట్‌ ఫ్రం వేస్ట్‌ జరిగాయి.
నేడు బహుమతుల ప్రదానం, ముగింపు సభ
పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నేడు బహుమతుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. తొలుత అకడమిక్‌ విభాగంలో క్విజ్‌, పద్యం-భావం, కార్టూన్‌లు గీయడం, వ్యక్తృత్వం తెలుగు, ఇంగ్లీషు, కథలు చెప్పటం, తెలుగులో మాట్లాడటం, మెమరీ టెస్ట్‌, మట్టితో బొమ్మలు చేయడం వంటి పోటీలు జరగనున్నాయి. కల్చరల్‌ విభాగంలో జానపద నృత్యం, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, క్లాసికల్‌ డ్యాన్స్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌, విచిత్ర వేషధారణ, లఘునాటిక, కోలాటం, ఏకపాత్రాభినయం ఆకట్టుకున్నాయి.