Jun 16,2023 00:35

ప్రజాశక్తి -గోకవరం మండలంలోని తిరుమలాయపాలెంలో అంబేద్కర్‌ విగ్రహం తొలగింపు ఘటనలో గాయపడిన వారిని ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ గురువారం పరామర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. అక్కడి నుంచి తిరుమలాయపాలెం చేరుకున్నారు. అంబేద్కర్‌ విగ్రహం తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్‌సి పేటకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అక్కడ జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా విచారకరమన్నారు. అన్యాయం జరిగితే అక్కడ బాధితులకు రక్షణగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం అక్కడ అంబేద్కర్‌ విగ్రహం పెట్టారని అర్ధరాత్రి పూట ఆడవాళ్లపై దాడులు చేసి చీరలు లాగేసి నలుగురు ఆడవాళ్లను కాళ్లు విరిగేలా కొట్టారన్నారు. వారు ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. పోలీసులు అర్ధరాత్రి మూడున్నర ప్రాంతంలో లైట్లు ఆర్పేసి రౌడీలు, గుండాల్లా దాడి చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. 144 సెక్షన్‌ ఊరంతా పెట్టాలిగానీ ఎస్‌సి పేటలోనే ఎందుకు పెట్టారని తహశీల్దారును ప్రశ్నించారు. పంచాయతీ స్థలంలో అంబేద్కర్‌ విగ్రహం తప్పుగా పెట్టి ఉంటే దానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అలా కాక అర్ధరాత్రి పోలీసు యంత్రాంగం మొత్తం ఎస్‌సిలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఏమిటన్నారు. ఇక్కడ కుల బహిష్కరణ చేశారన్నారు. పోలీసుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బాధితులకు ఎస్‌సి, ఎస్‌టి చట్టపరంగా రావాల్సినవన్నీ రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్‌సి, ఎస్‌టి సంఘాల నాయకులు పాల్గొన్నారు.