Oct 13,2023 23:22

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న యనమల రామకృష్ణుడు

వ్యక్తిగత వైద్యులను అనుమతించాలి
టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
రాజమహేంద్రవరం కేంద్ర కాగారారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఏదైనా జరిగితే సిఎం జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో విద్యానగర్‌లోని నారా లోకేష్‌ క్యాంప్‌ సైట్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుంచి ప్రభుత్వం, అధికారులు తప్పుడు సమాచారం బయటకు ఇస్తున్నారన్నారు. డాక్టర్లు పరిశీలించినట్లుగా ఆరోగ్య బులిటెన్‌లో లేదన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ తన సొంతంగా లేఖ రాసి బయటకు వదిలారన్నారు. డాక్టర్లు పరీక్షలు చేసిన రిపోర్టులు ఎక్కుడున్నాయని ప్రశ్నించారు. జైలులో చంద్రబాబు ఉండే బేరక్‌, పరిసర ప్రాంతం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చిందన్నారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నారో లేదో తెలీదని, అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు బరువుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ వయసులో చంద్రబాబును ఇలాంటి కష్టాలకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాక్టీసింగ్‌ లాయర్‌గా నేను చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లొచ్చు, కాని నన్ను అనుమతించడం లేదన్నారు. తన అర్హత సర్టిఫికేట్‌ ఇచ్చినా ఒప్పుకోవట్లేదన్నారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు కూడా మార్పులు చేసి సొంత రిపోర్టులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చి, కోలుకునే వరకూ వైద్యుల సమక్షంలోనే ఉంచాలన్నారు. ఆయనకు ఏం మందులిచ్చారో అనే అనుమానం ఉందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించాలన్నారు.
భువనేశ్వరికి పలువురి సంఘీభావం
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరికి పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. టిడిపి సీనియనర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆమెను కుటుంబ సభ్యులతోపాటూ కలిశారు. అలాగే మాజీ మంత్రులు సుజయకృష్ణ రంగారావు, పీతల సుజాత, నేతలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకట్‌రాజు, చింతకాలయ విజరు తదితరులు ఆమెను కలిసి సంఘీభావం తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి మద్దతు తెలిపిన ప్రజలకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.