Feb 09,2023 22:45

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, సామర్లకోట, సామర్లకోట రూరల్‌, కాకినాడ వారంతా రెక్కాడితేనే గాని డొక్కాడని కార్మికులు. కుటుంబాల పోషణ కోసం తక్కువ వేతనాలే అయినా తెలియని పని అయినప్పటికీ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఫ్యాక్టరీలో చేరి పట్టుపని పదిరోజులు కూడా కాలేదు. పని కూడా ఇంకా పూర్తిగానే రాదు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తెలియని పని చేయించి కానరాని లోకాలకు పంపించేసింది. ఆ వలస పక్షుల కుటుంబాల్లో తీరని వేదనని నింపింది అంబటి సుబ్బన్న అండ్‌ కో ఆయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటలో ఉన్న అంబటి సుబ్బన్న అండ్‌ కో ఆయిల్‌ ఫ్యాక్టరీలో ఆయిల్‌ ట్యాంకును శుభ్రం చేయడానికి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మతుల్లో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలానికి చెందిన వారు కాగా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. ఉదయం 7 గంటల సమయంలో 30 అడుగుల ఎత్తున ఉన్న క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు దిగారు. ఆ సమయంలో పరిశ్రమ యాజమాన్యం ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ఫలితంగా పాడేరు మండలం పర్రెడ పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెచ్చింగి కష్ణ (35), వెచ్చింగి నరసింహ(38) వెచ్చింగి సాగర్‌(20), వంచెడిపుట్టు గ్రామానికి చెందిన కుర్తాడి బొంజుబాబు(30), బొండాపల్లికి చెందిన ఈదులమెట్ట గ్రామ నివాసి కొర్ర రామారావు(42), పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన యల్లమిల్లి దుర్గాప్రసాద్‌ (28), కట్టమూరి జగదీష్‌(25) మరణించారు. వీరంతా ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని వచ్చిన వలస కూలీలు.
గిరిజన గ్రామాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాడేరు మండలానికి చెందిన 10 మంది గిరిజనులు ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో తమకు ఎవరూ జాగ్రత్తలు చెప్పలేదని, మిషన్‌లో నువ్వులు వేసి ఆడించడమే తమకు తెలిసిన పని, అయినా ట్యాంకులోకి దిగి పనులు చేయించారని అక్కడే ఉన్న తోటి వలస కార్మికులు భాస్కర్‌, బాలరాజు తెలిపారు. పది రోజుల క్రితమే ఇక్కడకు పనికి వచ్చామన్నారు.మతుల్లో కొర్ర రామారావుకు భార్య, 8 మంది పిల్లలు, నరసింహకు బార్య, నలుగురు పిల్లలు, కష్ణకు బార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. సాగర్‌కు ఇంకా వివాహం కాలేదు. కృష్ణ కూతురు పవిత్ర విశాఖపట్నంలో నర్సింగ్‌ చదువుతోంది. ఫీజ్‌ చెల్లించేందుకు డబ్బులు లేక ఈ పనికి వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
బంధువులు ఆందోళన
మతి చెందిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పులిమేరుకు చెందిన మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.రాజకుమార్‌, సిపిఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు సిఐటియు జిల్లా నాయకుడు డి.క్రాంతికుమార్‌ తదితరులు మాట్లాడారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. మతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మల రామస్వామి తదితరులు బాధితులకు మద్దతుగా నిలిచారు. అనుమతులు లేని పరిశ్రమ కార్యకలాపాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియాను అందించనున్నట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కతికశుక్లా తెలిపారు. అనంతరం వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు, ఎస్‌పి ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎంఎల్‌ఎ చిన్నరాజప్ప, ఆర్‌డిఒ జె.సీతారామరాజు, తహశీల్దార్‌ జితేంద్ర, అరకు ఎంపీ భర్త గొడ్డేటి శివప్రసాద్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.రాజకుమార్‌ ఇతర నాయకుల పరిశ్రమ యాజమాన్యంతో సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియాతో పాటు యాజమాన్యం మరో రూ.25 లక్షలు 15 రోజుల్లో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. అర్హత మేరకు వితంతు పెన్షన్‌, ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు ఫ్యాక్టరీలో మతుల కుటుంబీకులకు ఒకరికి పర్మినెంట్‌ ఉద్యోగం, తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చెల్లించేందుకు ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘం నాయకుల సమక్షంలో యాజమాన్యం ఒప్పంద పత్రాలను రాసి ఇచ్చారు. సంబంధిత బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఎస్‌పి రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.
బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
మంత్రి వేణుగోపాలకృష్ణ
జి.రాగంపేటలో ఆయిల్‌ ప్యాకేజీ కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ తెలిపారు. గురువారం స్థానిక జిజిహెచ్‌లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రమాదంపై సిఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. తక్షణమే స్పందించి ప్రభుత్వ సహాయంగా రూ.25 లక్షలు ప్రకటించారన్నారు. కంపెనీ తరఫున మరో రూ.25 లక్షలు బాధితులకు అందుతుందని తెలిపారు. ఘటనపై ప్రత్యేక కమిటీ వేశారని, మూడు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి, నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు. లోపాలు ఏవైనా ఉంటే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట జెసి ఎస్‌.ఇలక్కియ, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.హేమలత, డిఎస్‌పి పి.మురళీకృష్ణారెడ్డి ఉన్నారు.
కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఎం
ఆయిల్‌ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. కార్మికుల మరణానికి కారణమైన ఆయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలన్నారు. ఇటీవల కాలంలో పరిశ్రమల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.