పలు సంఘాల మద్దతు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
స్కూల్ ఆయాల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తామని పలువురు వక్తలుఅన్నారు. డిఇఒ కార్యాలయం వద్ద మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల ఆయాలు చేపట్టిన నిరసన శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని నినదించారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వి.రాంబాబు, పిఇటి అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్మోహన్, టిడిపి 17 వార్డు ఇన్‌ఛార్జి ఆంథోని హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ స్కూళ్లను విద్యాశాఖకు బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందులో పని చేసే పార్ట్ టైం కంటింజెంట్ వర్కర్లను గాలికి వదిలేశారన్నారు. సరైన గైడ్‌లెన్స్ ఇవ్వకుండా కాలయాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్, విద్యా శాఖ అధికారులకు ఆయాల సమస్యలు పట్టట్లేదన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు తమబాధ్యత లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, కలెక్టర్ ఇప్పకైనా స్పందించాలన్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేసి ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్వీపర్స్ యూనియన్ నాయకులు వై.ఝాన్సీ, తాయారు, సత్యవతి, శాంతి, తదితరులు పాల్గొన్నారు.










