Jun 22,2023 21:23

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న దళిత, ప్రజాసంఘాల నాయకులు

బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలి
కలెక్టర్‌కు దళిత, ప్రజాసంఘాల నాయకుల వినతి
25 మందితో తిరుమలయపాలెం దళిత పోరాట కమిటీ ఏర్పాటు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం
తిరుమలాయపాలెంలో దళితులపై విచక్షణారహితంగా అర్ధరాత్రి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేసి దాడికి పాల్పడిన పోలీసులు, గ్రామ పెత్తందారులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిÄనంగా శిక్షించాలని దళిత, గిరిజన ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలతకు వినతిపత్రం అందించారు. ఆనం కళాకేంద్రం సమీపంలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ లైబ్రరీ హాల్లో తూర్పు గోదావరి జిల్లా దళిత, గిరిజన ప్రజా సంఘాలు గురువారం తిరుమలాయపాలెం ఘటనపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఎస్‌సిలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు జిల్లా పరిధిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. రెండు, మూడేళ్లుగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, పాలకులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పలువురు ఈ సమావేశం దష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలను ఎదుర్కొనేందుకు దళిత, గిరిజన ప్రజాసంఘాలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని, బాధితులకు అండగా నిలిచేందుకు అవసరమైన కార్యచరణను రూపొందించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు టి.అరుణ్‌, అజ్జరపు వాసు, జువ్వల రాంబాబు, కప్పల వెలుగుకుమారి, తురకల నిర్మల, కోరుకొండ చిరంజీవి, తదితరులు గోకవరం మండలం తిరుమలాయపాలెం దళితులపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన దళితులందరూ కలిసి అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రభుత్వ స్థలంలో ప్రతిష్టాపించుకున్నారని, దీనిని ఓర్చుకోలేని పెత్తందారులు, సుమారు 150 నుంచి 200 మంది పోలీసులు దళితులపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారన్నారు. మహిళలను జట్టుపట్టుకుని కొట్టి, కులం పేరుతో దుర్భాషలాడారన్నారు. మీకు అంబేద్కర్‌ విగ్రహం కావాలా? అని అంబేద్కర్‌ను అవమానకరించేలా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా దాడి చేశారని వివరించారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని అక్కడ నుంచి తరలించారని తెలిపారు. పోలీసులు, పెత్తందారుల దాడిలో ఐదుగురు మహిళలకు కాళ్లు చేతులు విరిగిపోగా, సుమారు 50 మందికిపైగా దళితులు గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన నాటి నుంచి గ్రామానికి చెందిన దళితులను బయట ప్రాంతానికి వెళ్లనీయకుండా, ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలోని దళిత పేటకు వెళ్లనీయకుండా 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎస్‌సిలపై దాడి చేయడమే కాకుండా బాధితులైన ఎస్‌సి యువకులపైనే అక్రమంగా కేసులు పెట్టి రిమాండుకు తరలించారని వివరించారు. దాడి జరిగిన మరుసటి రోజు నుంచి ఎస్‌సిలను సాంఘిక బహిష్కరణకు గురిచేశారన్నారు. హోటళ్లలో టిఫిన్‌, మందుల షాపులో మందులు, కిరాణా దుకాణాల్లో కిరాణా సరుకులను ఇవ్వకుండా పెత్తందారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎస్‌సిలు సాంఘిక బహిష్కరణకు గురవుతున్నారన్నారు. తహశీల్దార్‌, విఆర్‌ఒ, విఆర్‌ఎ, గ్రామ సెక్రటరీల సమక్షంలోనే సాంఘిక బహిష్కరణ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ ఈ నెల 15న బాధితులను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారన్నారు. ఇప్పటి వరకూ మరేయితర ప్రజాప్రతినిధులు కాని, అధికారులు కాని ఆ గ్రామాన్ని సందర్శించలేదని వివరించారు. కలెక్టర్‌గా తిరుమలాయపాలెం గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవడంతోపాటు, అంబేద్కర్‌ విగ్రహాన్ని అదే ప్రాంతంలో పున ప్రతిష్టాపించాలని, దాడికి గురైన బాధితులకు భరోసా, భద్రత కల్పించాలని, నిందుతులపై అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, బాధితులకు ప్రభుత్వపరంగా నష్ట పరిహారం చెల్లించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందించారు. ఈ ఘటనపై వాస్తవ, అవాస్తవాలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.