May 22,2023 23:17

ముగింపు సభలో మాట్లాడుతున్న డాక్టర్‌ రవికుమార్‌

జెవివి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రవి కుమార్‌
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఆటలు, పాటలు, మాటలు పిల్లల సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతాయని జెవివి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌ అన్నారు. రాజమండ్రి చిల్డ్రన్స్‌ క్లబ్‌ (ఆర్‌సిసి), గోదావరి బాలోత్సవం ఆధ్వర్యంలో వేసవి వినోదం పేరుతో జరిగిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు సభ సోమవారం స్థానిక డిఎంహెచ్‌ స్కూల్‌ ఆవరణలో జరిగింది. ఈ సభకు గోదావరి బాలోత్సవం కన్వీనర్‌ పి.తులసి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జెవివి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌, రాజమండ్రి అర్బన్‌ స్కూల్స్‌ డిఐ దిలీప్‌కుమార్‌, చేతి రాత నిపుణులు రాజేష్‌ ఖన్నా, ప్రముఖ కార్టూనిస్ట్‌ శేఖర్‌, డిఎంహెచ్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు రాజాప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రాజా, కరాటే మాస్టర్‌ సుందరం, కోలాటం, నృత్య కళారూపాలు మాస్టర్‌ రమణ పాల్గొని మాట్లాడారు. ముగింపు సభలో జెవివి నాయకులు సిహెచ్‌.శ్రీరాములు మ్యాజిక్‌ షో, పిల్లల నృత్యాలు, కోలాటం విశేషంగా ఆకట్టుకున్నాయి.రాజమండ్రి చిల్డ్రన్‌ క్లబ్‌ నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరంలో ఆత్మ రక్షణా పద్ధతులు, కరాటే , కోలాటం, నత్యాలు, డ్రాయింగ్‌, కార్టూన్‌, పేపర్‌ క్రాఫ్ట్‌, తెలుగు, ఇంగ్లీష్‌ చేతి రాత, థీమ్‌ గేమ్స్‌ వంటి 25 రకాల అంశాలపై శిక్షణ నిర్వహించడం ఎంతో అభినందనీయమని వక్తలు కొనియాడారు.
గోదావరి బాలోత్సవం నిర్వాహకులు పి.తులసి మాట్లాడుతూ రెండేళ్లుగా ఆర్‌సిసి ఆధ్వర్యంలో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వేసవి శిబిరం ఎంతో ఉత్సాహంగా జరిగిందన్నారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్‌లో వివిధ నివాస ప్రాంతాల్లోనూ ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న చిన్నారులకు, వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చిన వారికి అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ వేసవి శిక్షణా శిబిరంలో ఓరిగామి శిక్షణ చిట్టితల్లి, ఫన్‌ మాథ్స్‌, ఫన్‌ సైన్స్‌ శిక్షణ జెవివి నాయకులు కృష్ణసాయి, తెలుగు చేతి రాత శిక్షణ దొరబాబు, గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌, కౌమార దశలో తదితర అంశాలపై ఫణిశ్రీ, పాటల శిక్షణ విజయగౌరి, అనిత తదితరులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి చిల్డ్రన్స్‌ క్లబ్‌ సభ్యులు జ్యోతిర్మయి, స్వేచ్ఛ, వర్షిణి, భాస్కర్‌, దుర్గాభవాని, జెవివి నాయకులు మల్లికార్జునరావు, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.