ఆసుపత్రి డైరక్టర్ రతీదేవి
ప్రజాశక్తి-నల్లజర్ల
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 31 వరకూ ఏలూరులోని తమ ఆశ్రం ఆసుపత్రిలో మహిళలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నామని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఆశ్రం ఆసుపత్రి) డైరక్టర్ జి.రతీదేవి తెలిపారు. నల్లజర్ల విచ్చేసిన ఆమె బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కుటుంబసభ్యులందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే ఇల్లాలు తన ఆరోగ్యం పట్ల మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. సాటి మహిళగా ఆలోచించి స్త్రీల ఆరోగ్యంపై దృష్టి సారించానన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 1వ తేదీ నుంచి 31 వరకూ తమ ఆసుపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్‌బిఎస్, సీరం క్రియేటైన్, హెచ్‌బి, టిసి, డిసి, ఇఎస్‌ఆర్, అల్ట్రా సౌండ్ స్కానింగ్, పాప్ స్మియర్ తదితర రక్త పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. గర్భిణులకు మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకూ వైద్యుల సలహాలు సూచనలతో పాటు వారికి ఉచితంగా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి మందులు, రాగి పౌడర్, పోషకాహర కిట్లు స్వచ్చందంగా అందజేస్తున్నామన్నారు. గర్భిణుల కోసం ప్రతి నెలా 9వ తేదీన నల్లజర్ల, పోతవరం పిహెచ్‌సి కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్యాంపుల్లో గుర్తించిన ఆర్థికంగా వెనుకబడిన వారికి స్కానింగ్, అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా తమ ఆసుపత్రిలో చేస్తున్నామన్నారు. వీరి రాకపోకల కోసం ఉచిత బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా తమ ఆశ్రం ఆసుపత్రిలో గర్భిణులకు అన్ని వేళలా ఉచితంగానే కాన్పులు నిర్వహిస్తున్నామని తెలిపారు.










