ప్రజాశక్తి-నల్లజర్ల ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 31 వరకూ ఏలూరు ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించినట్ల్టు ఆసుపత్రి సీనియర్ మేనేజర్ ఉల్లి రమేష్‌బాబు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నల్లజర్ల వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకూ ఏలూరు లోని తమ ఆసుపత్రిలో మహిళలకు సంబంధించి అవసరమైన వైద్య ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు తమ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఆర్‌బిఎస్, సీరంక్రియేటైన్, హెచ్‌బి, టిసి, డిసి, ఇస్‌ఆర్, అల్ట్రా సౌండ్ స్కానింగ్, పాప్ స్మియర్ తదితర రక్త పరీక్షలతో అవసరమైన సాధారణ పరీక్షలు ఈ నెల రోజులూ ఉచితంగా నిర్వహించనున్నామన్నారు. తమ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో అపార అనుభవం కలిగిన వైద్య బందం అధునాతన పరికరాలతో పేద, మధ్య తరగతి మహిళలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. గర్భిణులకు మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకూ వైద్యుల సలహాలు సూచనలతో పాటు వారికి ఉచితంగా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి మందులు, రాగి పౌడర్ వంటి పోషకాహర కిట్లు సైతం అందజేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా తమ ఆశ్రం ఆసుపత్రిలో గర్భిణులకు అన్ని వేళలా ఉచితంగానే కాన్పులు నిర్వహిస్తున్నామన్నారు.










