Feb 26,2023 23:50

చిన్నారుల భవితకు ఉత్సవం ప్రేరణ
ఉరిమే ఉత్సాహంతో పయనం
150 పాఠశాలల నుంచి 10వేల మంది హాజరు
60 విభాగాల్లో పోటీలు నిర్వాహణ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ఆట పాటలతో మెప్పించారు... విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలతో ఔరా..! అనిపించారు. నాట్యమయూరాల్లా నర్తించారు... పాటల్లో మాకు మేటి ఎవరు? నాటకాల్లో మాకన్నా సాటి ఎవరు? అని చాటిచెప్పారు... భవిత మాదే భారత్‌ మాదే అంటూ ఆసల ఊసులతో ఉరిమే ఉత్సాహంతో వచ్చే యేడు కలుద్దాం..అంటూ బాలోత్సవానికి వీడ్కోలు పలికారు. సృజన్మాకతకు సరైన వేదిక బాలోత్సవం అని రుజువు చేశారు..
చారిత్రక, సాంస్కతిక రాజధాని రాజమహేంద్రవరం నగరంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 'గోదావరి బాలోత్సవం' మొదటి పిల్లల పండుగ ఆదివారంతో ముగిసింది. రెండు రోజులుగా కళాశాల ప్రాంగణం బాలల కేరింతలతో మారుమోగింది. చివరి రోజుకు కోలాహలంగా...ఉత్సాహపూరిత వాతావరణంలో బాలోత్సవం ముగిసింది. ముగింపు వేడుకలు గోదావరి బాలోత్సవం ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎన్‌.రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మాట్లాడారు. బాలల స్వేచ్ఛను హరించొద్దు అని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. వారికి నచ్చినవిధంగా నడుచుకునేలా ప్రోత్సహించాలన్నారు. బాలల్లో అత్యుత్తమైన ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికితీయడం ద్వారా వివిధ రంగాల్లో నిష్టాతులుగా ఎదుగుతారని తెలిపారు. ప్రస్తుతం విద్యావ్యవస్థ అభివృద్ధికి దోహదపడట్లేదన్నారు. బట్టీ చదువులు సమాజానికి చేటు అన్నారు. అభివృద్ధి వైపు వెళ్లే విద్యను ప్రోత్సహించేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. బాలల సృజనాత్మకతను వెలికి తీసే ఈ బాలోత్సవాల్లో మరింతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ న్యాయవాదులు మద్దూరి శివసుబ్బారావు, ముప్పాళ్ళ సుబ్బారావు, అర్బన్‌ డిఐ దిలీప్‌కుమార్‌ మాట్లడుతూ బాలల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయడం ద్వారానే మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. గోదావరి బాలోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న బాలలను అభినందించారు.
రెట్టించిన ఉత్సాహంతో నిర్వహిస్తాం
రెండు రోజులపాటు నిర్వహించిన గోదావరి బాలోత్సవం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని, ఈ స్ఫూర్తితో వచ్చే ఏడాది రెట్టించిన ఉత్సాహంతో గోదావరి బాలోత్సవాన్ని నిర్వహిస్తామని ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎన్‌ రాజు, గోదావరి బాలోత్సవం కార్యదర్శి పి.తులసి వెల్లడించారు. గోదావరి బాలోత్సవం విజయవంతం వెనుక ఎందరో కృషి ఉందని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా సహకరించిన దాతలకు వారు ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన గోదావరి బాలోత్సవంలో నగరంలోని వివిధ కళాశాలల నుంచి వాలంటీర్లుగా వచ్చి సేవలందించిన విద్యార్థులకు గోదావరి బాలోత్సవం ఆహ్వాన కమిటీ తరుపున అభినందనలు తెలిపింది.
460 విభాగాల్లో పోటీలు
రెండు రోజులపాటు కల్చరల్‌, అకడమిక్‌ విభాగాల్లో నిర్వహించిన 60 పోటీల్లో రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌, కడియం మండలాలకు చెందిన 150 ప్రభుత్వ, ప్రైయివేటు విద్యా సంస్థల నుంచి సుమారు 10 వేల మంది వరకూ విద్యార్థులు పాల్గొన్నారు. కల్చరల్‌ విభాగంలో సీనియర్స్‌కు జానపద నత్యం(బందం), క్లాసికల్‌ డ్యాన్స్‌(సోలో), లఘునాటిక(బృందం), ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటేషన్‌, విచిత్ర వేషధారణ(సోలో), దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన(బందం), జానపద గీతాలాపన(బందం), కోలాటం(బృందం) పోటీలను నిర్వహించారు. అకడమిక్‌ విభాగంలో జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో కార్టూన్‌ గీయడం, మెమొరీ టెస్ట్‌, దినపత్రికా పఠనం, స్పెల్‌ బి ఇంగ్లీషు, క్విజ్‌, వ్యక్తృత్వం తెలుగు, వ్యక్తృత్వం ఇంగ్లీషు, కథ చెప్పడం(తెలుగు), తెలుగులో మాట్లాడటం, పద్యం, భావం(తెలుగు), మట్టితో బొమ్మలు చేయడం, మ్యాప్‌ పాయింటింగ్‌, బెస్ట్‌ ఫ్రం వేస్ట్‌, కథా విశ్లేషణ, అంతర్జాలంలో అన్వేషణ, కవితా రచర, వార్త రచన(తెలుగు) వంటి పోటీల్లో బాలలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో దాగివున్న నైపుణ్యతను, సృజనాత్మకతను బయటపెట్టారు. రెండు రోజుల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన బాలలకు ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి, నున్న తిరుమలరావు, డాక్టర్‌ గన్ని భాస్కరరావు, ఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథరావు, నున్న నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాదులు మద్దూరి శివసుబ్బారావు, ముప్పాళ్ళ సుబ్బారావు, అర్బన్‌ ఎడ్యుకేషనల్‌ అధికారి దిలీప్‌కుమార్‌, సీనియర్‌ జర్నలిస్టు వివిఎస్‌ కష్ణకుమార్‌, తలారి వాసు, అఖిల భారత నర్సరీ సంఘం నేత పల్లా సుబ్రహ్మణ్యం, టి.క్రాంతికిరణ్‌, గుబ్బల రాంబాబు, సప్పా దుర్గాప్రసాద్‌, పి.సతీష్‌, పి.ఆనంద్‌, ఎ.షరీఫ్‌, తదితరుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారిని జ్ఞాపికలను అందించారు.
ఏర్పాట్లు బాగున్నాయి
మా పాప రూపిక క్లాసికల్‌ డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొంది. కొంతకాలంగా శిక్షణ తీసుకుంటుది. స్కూలు టీచర్ల ద్వారా గోదావరి బాలోత్సవ్‌ గురించి తెలుసుకున్నాం. ఏర్పాట్లు బాగున్నాయి. వేలాది మంది విద్యార్థులు హాజరైనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్వహకులకు అభినందనలు.
-పి.సుభాషిణి
చాలా ఆనందంగా ఉంది
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో క్లాసికల్‌ డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొన్నాను. జిల్లాలోని వివిధ పాఠాలల నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడ ప్రదర్శనను ఇచ్చారు. పోటీలలో పాల్గొనటంతో పాటు కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పోటీలలో పాల్గొని ప్రదర్శన ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
- కె. భార్గవి. పదో తరగతి విద్యార్థి
ప్రతిభను వెలికితీసేందుకు దోహదం
నేటి విద్యా విధానం మార్కులు, ర్యాంకులకే పరిమితం అవుతుంది. గోదావరి బాలో త్సవం పేరుతో చిన్నారుల పండుగ నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నాను. ఈ పోటీల్లో మా పాప లిఖిత ఏకపాత్రాభినయం చేసింది. చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమం చేపట్టిన నిర్వహకులకు అభినందనలు.
- ఎవి.నర్సింహారావు, వేమగిరి