Mar 13,2023 23:09

సంబారాలు చేసుకుంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-తాళ్లపూడి
తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడంతో పాటు ఆస్కార్‌ అవార్డు అందుకోవడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణమని తాళ్లపూడిలోని శ్రీ విజేత హై స్కూల్‌ వ్యవస్థాపక కరస్పాండెంట్‌ మోపిదేవి విజయలక్ష్మి అన్నారు. నాటు-నాటు పాటకు అవార్డు రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ చిత్ర నిర్మాత డివివి.దానయ్య తాళ్లపూడికి చెందిన వ్యక్తి కావడమే కాకుండా, సంగీత దర్శకుడు ఎంఎం,కీరవాణి, దర్శకుడు రాజమౌళి కూడా ఈ ప్రాంతానికి చెందినవారు కావడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం డాక్టర్‌ జొన్నకూటి ప్రమోద్‌కుమార్‌, ఉపాధ్యాయులు నరేష్‌, మల్లిబాబు, కరుణ, దివ్య, విద్యార్థులు పాల్గొన్నారు.