ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం లక్ష్య సాధనలో వెనుకంజలో ఉంది. ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపడతామని అధికార యంత్రాంగం ప్రకటనలు చేసిన విషయం విదితమే. అయితే కేవలం మరో రెండు వారాలే గడువు ఉన్నప్పటికీ తొలిదశ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాలేదు. ఉగాది నాటికి 18,273 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం తీసుకోగా గడువు తేదీ నాటికి 11,954 మాత్రమే పూర్తయ్యాయి. లక్ష్యంలో 65 శాతం మాత్రమే చేరుకున్నారు. గడువు తేదీ నాటికి 14,148 ఇళ్లు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ విధంగానూ 4,125 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. సిఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని గతేడాది డిసెంబరులో గహప్రవేశాలు చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా పెరగడం, ఇసుక కొరత, ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవటం వంటి కారణాలు వేధించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉగాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యం తీసుకున్నారు. లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చారు.
జిల్లాలో 54,418 ఇళ్ల స్థలాలు మంజూరు
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా గహ నిర్మాణానికి ప్రాధాన్య మిచ్చింది. జిల్లావ్యాప్తంగా జగనన్న కాలనీ లేఅవుట్‌లను ఏర్పాటు చేసింది. మొత్తం 54,418 మందికి ఇళ్ల పట్టాలను అందించింది. గహనిర్మాణం కింద ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేటాయించినట్టు ప్రకటించింది. నివాసయోగ్యం కాని ప్రాంతాలైన ఆవ భూములు, కొండలు, గుట్టలు, ఊరికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో లేఅవుట్‌లు కేటాయించడంతో లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు సెంటున్నర స్థలం కేటాయించడంతో ఎక్కువ మందిలో ఆశలు నీరుగారిపోయాయి. కొన్ని చోట్ల లేఅవుట్లు కేటాయించి రెండేళ్లు దాటుతున్నా వాటిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. దీంతో నిర్మాణాలకు లబ్ధిదారులు విముఖత చూపారు. దీంతో అధికారులు ఒత్తిడి చేసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఇప్పుడిప్పుడే మౌలిక వసతులు
లేవుట్లలో మౌలిక వసతులు ఇప్పుడిపుడే కల్పిస్తున్నారు. ప్రధానంగా ఇసుక లభ్యత లేకపోడం కూడా ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. సాక్షాత్ గృహ నిర్మాణ శాఖ మంత్రి సమక్షంలోనే ఇసుక కొరత అంశాన్ని జిల్లా ప్రజా ప్రతి నిధులు ప్రస్తావించారు. అటు మంత్రి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇసుక విషయంలో ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. దాని ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడుతోంది. కాలనీల్లో రోడ్లు, కాలువల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించారు ఆర్‌డబ్ల్యుఎస్ బోర్ల తవ్వకాలపై దష్టిపెట్టింది. విద్యుత్ శాఖ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేసే పనిలో పడింది. ఇలా మౌలిక వసతులు కల్పించక ముందే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతుండడంతో చాలామంది లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. జిల్లాలో 240 మంది లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణాలకు పునాది కూడా వేయలేదు.
జిల్లా వ్యాప్తంగా 306 లే అవుట్లు
జిల్లావ్యాప్తంగా 306 లే అవుట్‌లను ఎంపిక చేశారు. 54,418 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. బేస్‌మెంట్ తక్కువ దశలో 26,933 ఉన్నాయి. బేస్‌మెంట్ లెవల్‌లో 8,885 ఇళ్లు ఉన్నాయి. రూఫ్ లెవల్‌లో 1,834 ఉన్నాయి. రూఫ్ దశలో 773 ఉన్నాయి. ఈ నెల 22 ఉగాది నాటికి తొలి దశలో 18273 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్నారు. ఇప్పటి వరకూ 1,1954 పూర్తయ్యాయి. తొలి లక్ష్యంలో 6319 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ లెక్కన రోజుకు సుమారు 438 చొప్పున ఇళ్లు చొప్పున పూర్తి చేస్తే కానీ లక్ష్యానికి చేరుకోలేరు.










