Sep 23,2023 13:27

ప్రజాశక్తి-ఉండి: ఇటీవల మరణించిన ఉండి గ్రామ మాజీ సర్పంచ్, విశ్రాంత ఇంజనీర్, రైతు పోరాట ఉద్యమ నాయకులు గొట్టుముక్కల అర్జున రాజు సేవలు వెలకట్టలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె ఎన్ వి గోపాలన్ అన్నారు. శనివారం అర్జున రాజు కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జె ఎన్ వి గోపాలన్ మాట్లాడుతూ గొట్టుముక్కల అర్జున రాజు గ్రామ సర్పంచ్ గా గ్రామానికి ఎన్నో సేవలు అందించి సర్పంచ్ పదవికి వన్నెతెచ్చారని కొనియాడారు. ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అర్జున రాజు ఆదర్శప్రాయుడని అన్నారు. 1982 నుండి 87 వరకు ఉండి గ్రామ సర్పంచ్ గా పనిచేసిన ఆయన గ్రామ రూపురేఖలు మార్చి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు. రైతు పోరాట ఉద్యమాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే వారని గుర్తు చేశారు. అర్జున రాజు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి  సిపిఎం మండల కార్యదర్శి ధనకొండ శ్రీనివాస్, నాయకులు కడలి నాగేశ్వరరావు పాల్గొన్నారు.