Feb 20,2023 23:04

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఆర్‌టిసి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రిక్తహస్తం చూపిస్తోంది. ఐదు నెలలుగా ఓవర్‌ టైమ్‌ చేస్తున్న వారికి చెల్లింపులు నిలిపివేసింది. టిఎ బిల్లులను చెల్లింపులు చేయటంలేదు. తూర్పు గోదావరి జిల్లాలో అక్షరాలా రూ.2 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం మొత్తం నాలుగు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో సుమారు 1030 మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది పని చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆంచనాల ప్రకారం ఒకొక్క ఉద్యోగికీ సుమారు రూ.20,000 నుంచి 40,000 వరకూ ఒటి చెల్లించాలి. డైవర్లు, కండక్టర్లకు చాలా ఏళ్లుగా ఓవర్‌ టైమ్‌ అమల్లో ఉంది. 240 కిలోమీటర్లు దాటి 8 గంటలు పైబడి పనిచేసిన కాలాన్ని ఓవర్‌ టైమ్‌గా పరిగణిస్తారు. దీనికి అదనంగా జీతం అందించాలి. సాధారణంగా సుదూర ప్రాంత సర్వీసులకే ఒటి వర్తిస్తుంది. విశాఖపట్నం, విజయవాడ, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లే వారు షెడ్యూల్‌ టైమ్‌ కంటే అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఒటి చేయాల్సిన సర్వీసులు జిల్లాలో సుమారు 30 వరకూ ఉన్నాయి. ఈ సర్వీసులకు వెళుతున్న డ్రైవర్‌, కండక్టర్‌కు ఒటి తప్పనిసరి. అలాగే డేఅవుట్‌, నైట్‌ అవుట్‌ డ్యూటీలు చేస్తున్న వారికి అదనంగా అలవెన్స్‌ అందించాలి. నైట్‌ హాల్ట్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌కు రూ.90 చొప్పున అదనంగా అందించాలి.
ఒకవైపు సిబ్బంది కొరత, మరో వైపు పని ఒత్తిడి
జిల్లాలో రాజమహేంద్రవరం, నిడదవోలు, గోకవరం, కొవ్వూరు ఆర్‌టిసి డిపోలు ఉన్నాయి. ఈ నాలుగు డిపోల నుంచి అంతర్‌ రాష్ట్ర, జిల్లా సర్వీసులతో పాటు గ్రామీణ సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 306 బస్సులు సేవలందిస్తున్నాయి. సుమారు 70 గ్రామీణ సర్వీసులు నడుస్తున్నాయి. సాధారణంగా సుపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సులు రెండు రోజులకు సగటున 1,500 కిలోమీటర్లు వరకూ తిరుగుతాయి. విజయవాడ, భద్రాచలం, విశాఖపట్నం సర్వీసు బస్సులు నెలకు 20 వేల కిలోమీటర్లపైగా ప్రయాణిస్తాయి. గ్రామీణ సర్వీసులు రోజుకు సగటున 300 కిలోమీటర్ల మేర తిరుగుతాయి. 2012 నుంచి కొత్త నియామకాలు లేవు. అన్నీ కాంట్రాక్ట్‌ ప్రతిపాదికనే భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా గ్యారేజీల్లో కూడా 40 శాతం వరకూ కాంట్రాక్ట్‌ సిబ్బందే పనిచేస్తున్నారు. వారికి జీతాలు అంతంత మాత్రమే. గ్యారేజీలో నిపుణులైన మెకానిక్‌లు లేకపోవడం, విడి పరికరాలు సరఫరా జరగకపోవడంతో మరమ్మతు పనులు సక్రమంగా జరగడం లేదు. వాస్తవానికి ఒక్కో బస్సుకు డ్రైవరు, కండక్టర్‌, గ్యారేజీ మెకానిక్‌లు కలుపుకొని ఐదుగురు బాధ్యులుగా ఉండాలి. కానీ బస్సులు నిష్పత్తిని తీసుకుంటే ఒకరు కూడా లేని పరిస్థితి. సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై పనిభారం పడుతోంది. 8 గంటలు డ్యూటీ చేయాల్సి ఉన్నా. 12 గంటలు చేయిస్తున్నారని యూనియన్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు గ్యారేజీలో బస్సు అప్పగించేటప్పుడు డ్రైవరు ఏవైనా లోపాలుంటే లాగ్‌ బుక్‌లో రిజిస్టర్‌ చేస్తారు. వాటిని రాత్రికి మెకానిక్‌లు సరి చేయాలి. ఉదయానికే బస్సును సిద్ధం చేయాలి.కానీ డిపోల్లో మెకానిక్‌లు లేకపోవడం పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఈ విధానం సక్రమంగా అమలు కావడంలేదు. ఆ ప్రభావం కూడా బస్సులపై పడుతోంది.
ఊరట ఇవ్వని విలీనం
గతేడాది జనవరి 1న ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. దీంతో తామంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారామని కార్మికులు సంబరపడ్డారు. ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లిస్తుందని ఆశించారు. కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన అలవెన్స్‌లు, రాయితీలను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రభుత్వంలో విలీనం తరువాత ఉద్యోగులుగానే పరిగణిస్తామని.. అలాంటప్పుడు రాయితీలు, అలవెన్స్‌లు ఇవ్వలేమన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనం అయిన సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేసింది. దీంతో జీతాలు పెరిగాయి. కానీ ఆర్‌టిసి ఉద్యోగుల జీతాలు మాత్రం పెంచలేదు. అప్పట్లో సాంకేతిక కారణాలు చూపుతూ తాత్సారం చేశారు. దీంతో ఆర్‌టిసి ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. దీంతో గతేడాది జూన్‌ 6న పిఆర్‌సి అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది జూలై నెల నుంచి పెరిగిన వేతనాలు ఇస్తారని ఉద్యోగులు ఆశించారు. కానీ ఉద్యోగులకు మొండిచేయి చూపారు. దీనికి సాంకేతిక కారణాలను సాకుగా చూపారు. అప్పటివరకూ ఆర్‌టిసిలో జీతాల చెల్లింపునకు ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేవారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో ఈ రెండుసాఫ్ట్‌వేర్‌లు లింక్‌ చేయడం కుదరదని అధికారులు తేల్చారు. జీతాల పెంపు ఉత్తర్వులు వచ్చిన రెండు నెలల అనంతరం.. సెప్టెంబరు నుంచి సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు చెల్లించడం ప్రారంభించారు. పెరిగిన వేతనాలు అందిస్తున్నారు.. కానీ ఓటీ, ఇతరత్రా అలవెన్స్‌లు మాత్రం నిలిపివేశారు. గత ఆరు నెలలుగా ఇటువంటి చెల్లింపుల ఊసేలేదు.