Feb 07,2023 22:51

ఫిర్యాదులపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ మాధవీలత

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు అందించే సేవలు నిమిత్తం ఎటువంటి రుసుములు వసూలు చేసినా ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత స్పష్టం చేశారు. అవసరమై అయితే సంబంధిత ఆసుపత్రి లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ తొలి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల ప్రతినిధులతో ఫిర్యాదుల వారీగా వివరణ తీసకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య సేవలు విషయంలో ఎటువంటి నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. నగదు వసూలు చేయడం, వైద్య సేవల్లో లోపాలు, స్కానింగ్‌ ఫీజ్‌ వసూలు, రోగిని చేర్చు కోవడానికి తిరస్కరించడం వంటి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. మొత్తం 202 ఫిర్యాదులు 47 సచివాలయాల పరిధిలో నమోదు చేసినట్లు తెలిపారు. 48 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి 105, రిజిస్ట్రేషన్‌ సంబంధించి 48, ఇతరాలు 49 ఫిర్యాదులు జిల్లా పరిధిలో వివిధ ఆసుపత్రులపై నమోదయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఐవిఆర్‌ఎస్‌ ద్వారా ఫిర్యాదు చేసిన రోగి ఎం.వెంకటేష్‌తో కలెక్టర్‌ ఫోన్‌లో మాట్లాడారు. సమగ్ర సమాచారం అందిస్తే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని మాధవీలత తెలిపారు. కొన్ని ఫిర్యాదులకు సంబంధించి పెనాల్టీ విధించారు. ఆరోగ్య మిత్రాలు కూడా స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు. ఈ సమావేశంలో సమన్వయ కర్తగా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.ప్రియాంక, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి హాజరయ్యారు.