ప్రజాశక్తి-రాజమహేంద్రవరం స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా పూర్తి పారదర్శకతతో నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ డిఆర్‌ఒ జి.నరసింహులుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అనంతరం నాణ్యతతో కూడిన పరిష్కార పత్రాన్ని అర్జీదారునికి అందజేయాలన్నారు. స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ తిరిగి ఓపెన్ కాకుండా ఆయా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం స్థానిక వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో స్పందన, సుస్థిర అభివద్ధి అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలను అందజేస్తారని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరూ ఉదయం 9.30 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రానికి చేరుకోవాలన్నారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీనీ 24 గంటల్లోపు వెబ్ సైట్ ఓపెన్ చేసి అర్జీని పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం వివిధ సమస్యలపై ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ జి.నరసింహులు, టూరిజం అధికారి స్వామినాయుడు, డిసిహెచ్‌ఒ డాక్టర్ ఎం.సనత్ కుమారి, డిప్యూటీ డిఎం హెచ్‌ఒ డాక్టర్ ఎన్.వసుందర, సిపిఒ కె.ప్రకాష్‌రావు, డిపిఒ పి.జగదాంబ, పశుసంవర్థక శాఖ అధికారి ఎస్‌జిటి సత్యగోవింద్, డ్వామా పీడీ జిఎస్.రామగోపాల్, హౌసింగ్ పీడీ జి.పరశురామ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కె.జ్యోతి, డిఎస్‌ఒ పి.ప్రసాదరావు, డిఎల్‌డిఒ పి.వీణాదేవి, ఆర్‌డబ్ల్యు ఎస్‌ఇ డి.బాలశంకర్ రావు, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ ఎవిబి.ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు పాల్గొన్నారు.










