ప్రజాశక్తి-రాజమహేంద్రవరం అర్జీదారులకు సంతృప్తికరమైన విధానంలో తిరిగి రాకుండా పరిష్కారం చూపాలని కలెక్టర్ డాకట్ర కె.మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీలను జెసి ఎన్.తేజ్ భరత్‌తో కలిసి వినతి ప్రతాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరుచుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో స్వీకరించే ప్రతి దరఖాస్తును 24 గంటల్లో పరిష్కరించడమా లేదా తిరస్కరించడమా అనే అంశాలపై వివరణ ఇవ్వాలని తిరస్కరించదలిస్తే సరైన కారణాలు తెలపాలన్నారు. ఎపి సేవ పోర్టల్‌లో ఉన్న పెండింగ్ దరఖాస్థులపై సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 221 మంది అర్జీదారులు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ జి.నరసింహులు, డిసిహెచ్‌ఒ డాక్టర్ ఎం.సనత్ కుమారి పాల్గొన్నారు.
పోలీసు స్పందనలో 17 ఫిర్యాదులు
జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది ఫిర్యాదుదారుల అర్జీలను ఎఎస్‌పి ఎం.రజనీ సోమవారం స్వీకరించారు. ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను జాప్యం లేకుండా తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు.










