May 14,2023 23:56

ప్రజాశక్తి - తాళ్లరేవు, యానాం, కాకినాడ కార్పొరేషన్‌ వారంతా మహిళా కార్మికులు. కుటుంబ పోషణ నిమిత్తం యానాం నుంచి తాళ్లరేవులో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీకి రోజూ పనికి వెళ్తుంటారు. ఎప్పటి లానే ఆదివారమూ పనికి అందరూ కలిసి వెళ్లారు. పని ముగించుకుని ఒకే ఆటోలో ఇళ్లకు పయనమయ్యారు. ఇదే వారికి చివరి రోజు అవుతుందని ఊహించలేదు. గమ్యం చేరకముందే ప్రయివేటు బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. ఏడు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఆదివారం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీలోని సుబ్బారాయుడు దిమ్మ సెంటర్‌ వద్ద ఓ ప్రయివేటు బస్సు మహిళా కార్మికులతో వెళ్తున్న ఆటోను వేగంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
యానాంలోని ప్రాన్స్‌తిప్ప, కురసం పేట, మెట్టకూరు, వెంకటనగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన 14 మంది మహిళలు తాళ్లరేవు మండలం కోరంగిలోని అపెక్స్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌లో పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం పని ముగించుకుని అదే ఫ్యాక్టరీ నుంచి వారంతా ఒకే ఆటలో యానానికి బయలు దేరారు. ఆటో తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని సుబ్బారాయుడు దిమ్మ సెంటర్‌కు వచ్చింది. అదే సమయంలో ఎదురుగా యానాం నుంచి కాకినాడ వైపునకు వెళ్తున్న ప్రయివేటు బస్సు వేగంగా వస్తోంది. రోడ్డుపై ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు పెట్టిన బారికేడ్లను సైతం ఢకొీని ఆటోపైకి దూసుకొస్తోంది. ఇది గమనించి డ్రైవర్‌ ఆటోలో నుంచి దూకేశాడు. అనంతరం బస్సు వేగంగా ఢకొీన్ని దాదాపు 100 మీటర్ల దూరం లాక్కుపోయింది. మృతుల శరీరభాగాలు, రక్తంపు మరకలతో ఆ ప్రాంతం హృదయవిదాకరంగా మారిపోయింది. ఆర్తనాదాలతో మారుమోగింది.
ఈ ప్రమాదంలో యానాం ఫ్రాన్స్‌ తిప్పకు చెందిన బొక్క అనంతలక్ష్మి(47), వెంకటనగర్‌కు చెందిన చింతపల్లి జ్యోతి(38), కొత్త బస్టాండ్‌కు చెందిన కల్లి పద్మ(38), కురసం పేటకు చెందిన నిమ్మకాయల లక్ష్మి(54), మెట్టకుర్రుకు చెందిన కర్రి పార్వతి(42), మెట్టకురు వంశీకృష్ణ కాలనీకి చెందిన చేశెట్టి వెంకటలక్ష్మి(41), అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రాన్స్‌తిప్పకు చెందిన బుడపనేటి సత్యవతి, రచ్చ వెంకటేశ్వరమ్మ, మల్లాడి గంగాభవాని, బుడపనేటి ప్రభావతి, కురసంపేటకు చెందిన నోట్ల సత్యవేణి, ఓలేటి లక్ష్మి, గణపతి నగర్‌కు చెందిన కోటి నీలిమ, వెంకటనగర్‌కు చెందిన చింతపల్లి మంగాయమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు అంబులెన్సుల్లో కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుడపనేటి సత్యవతి(38) మృతి చెందింది. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని డిఎస్‌పి మురళీకృష్ణ, కాకినాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌, కోరంగి ఎస్‌ఐ శ్రీనివాస్‌కుమార్‌ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌, ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : సిపిఎం
రోడ్డు ప్రమాదంలో మరణించిన రొయ్యల పరిశ్రమల కార్మికులకు చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సిపిఎం మండల కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలన్నారు. ప్రమాదానికి మూల కారణమైన బైపాస్‌ సెంటర్లో సిగల్స్‌ ఏర్పాటు చేయాలని, చొల్లంగి నుంచి ఎదురులంక వంతెన వరకు మధ్యలో డివైడర్‌ను తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. రొయ్యల పరిశ్రమల యాజమాన్యం చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
బాధితులకు పలువురి పరామర్శ
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాధితులను ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌, యానాం ఎంఎల్‌ఎ గొల్లపల్లి అశోక్‌, కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, ముమ్మడివరం జనసేన పార్టీ ఇన్‌చార్జి పితాని బాలకృష్ణ, ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో వైసిపి నాయకులు కొపనాతి నాగరాజు తదితరులు సహకరించారు.