Aug 04,2023 00:17

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌
అర్హులందరీకి సంక్షేమ పథకాలను సిఎం వైఎస్‌ జగన్‌ ఈ నాలుగేళ్లలో ప్రజలకు అందించారని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత తెలిపారు. గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంపై క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టెక్నికల్‌ సమస్యలు, చిన్న చిన్న పొరపాట్ల వల్ల అర్హులై ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే లక్ష్యంతో జల్లెడ పట్టి వెతికి మరీ అర్హులైన ప్రతి ఒక్కరికీ 100 శాతం పథకాలు అందేలా జగనన్న సురక్ష కార్యక్రమానికి చేపట్టారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన చూసి జగనన్నే మా భవిష్యత్‌.. మా నమ్మకం నువ్వే జగన్‌ అనే నినాదం ప్రజల నుంచి వచ్చిందని హోంమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగిందన్నారు. సాంకేతిక కారణాలతో సంక్షేమ ఫలాలు పొందని అర్హులకు లబ్ధి చేకూర్చడమే కాకుండా, అవసరమైన వారికి 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందించడం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లాలని ఆరోపణలు గుప్పిస్తున్నారని తెలిపారు. జగనన్న సురక్ష రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత ప్రభావంతంగా తీసుకెళ్లేలా సిబ్బందికి అవగాహన కల్పించిన మొత్తం పర్యవేక్షణలో సహకరించిన కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, గహసారథులు, ప్రజా ప్రతినిధులకు జగనన్న సురక్ష విజయంలో ప్రత్యేక స్థానం వుందని అందరిని హోం మంత్రి తానేటి వనిత అభినందించారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
వరద బాధితులకు నిత్యావసరాలు అందజేత
కొవ్వూరు రూరల్‌ : గోదావరి వరద బాధితులకు రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. గురువారం కొవ్వూరు మండలం వరద ప్రభావిత ప్రాంతమైన మద్దూరులంకలో 434 కుటుంబాలకు నిత్యాసర సరుకులను హోం మంత్రి అందజేశారు. ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కేజీ, మంచినూనె ఒక లీటర్‌ చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మద్దూరు లంకలో చిన్నపాటి వరదకు కూడా గ్రామంలో ప్రతి కుటుంబానికి నిత్యావసరాలను అందించామన్నారు. ఈ గ్రామం భవిష్యత్తులో వరదకు ముంపు కాకుండా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కొవ్వూరు తహశీల్దార్‌ బి. నాయక్‌, అధికారులు పాల్గొన్నారు.