ప్రజాశక్తి-చాగల్లు రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్టు హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని నేలటూరు గ్రామంలో సోమవారం 84వ రోజు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో హోమ్ మంత్రి వనిత పాల్గొన్నారు. గ్రామంలోని డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ గత టిడిపి పాలకులు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారని, దీని వల్ల డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యం అయ్యాయని హోమ్ మంత్రి గుర్తు చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు, గ్రామ సచివాలయ సిబ్బందిని మంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యురాలు తాళ్లూరు రమ్య, జెడ్‌పి వైస్ చైర్మన్ పోసిన శ్రీవిద్య, వైసిపి మండల అధ్యక్షుడు డాక్టర్ చెల్లింకుల దుర్గామల్లేశ్వరావు, జె.శ్యామ్, ఉన్నమట్ల మనశ్శాంతి, తాలూరు దామోదరావు, గూడపాటి శివ, ముప్పిడి మహాలక్ష్మి, ఎంపిడిఒ రామ్‌ప్రసాద్, సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.










