ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తూ, అందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. కొవ్వూరు టౌన్‌లో 1వ వార్డు శ్రీరామ కాలనీలో ఆదివారం రాత్రి నిర్వహించిన 120వ రోజు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విస్తతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చిన్నారులు, మహిళలు, వద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుకు జవాబుదారీ వహిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సిఎం రూపొందిం చారన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం గురించి ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను మంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.










