Jun 02,2023 22:49

ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు
విత్తడానికి ముందే రైతుల్లో దిగులు
దక్కని మద్దతు ధరతో అగచాట్లు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ట్రాక్టర్లు, యంత్రాల అద్దెలు ప్రతి ఏటా పెరగడంతో పెట్టుబడులు పెరిగి వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. గత రబీ పంటకు ప్రస్తుత ఖరీఫ్‌కు ఎకరాకు రూ.5వేలకు పైగా ధరలు పెరిగినట్లు రాజమహేంద్రవర రూరల్‌కు చెందిన ఓ రైతు వివరించారు. ఒకప్పుడు పల్లెల్లో ఇళ్ల ఎదుట కాడెద్దులు, పశువులు, వ్యవసాయ సామగ్రి కనిపించేవి. కాలక్రమేణా ఎడ్ల పోషణ భారంగా మారడంతో సేద్యపు ఎడ్లు, పనిముట్ల స్థానాన్ని ట్రాక్టర్లు, యంత్రాలు ఆక్రమించాయి. దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు, మందుల పిచికారీ కోసం కూడా యంత్రాలపైనే ఆధారపడక తప్పడం లేదు. నిత్యం పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఇప్పుడు రైతులకు అదనపు భారంగా మారుతున్నాయి. రైతులు పాత పద్ధతుల్లో సాగు చేయలేక కొత్త పద్ధతులు అందుకోలేక సతమతమవుతున్నారు. చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతి ఏటా ఖర్చులు పెరగడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టిన విషయం విధితమే. వరతలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కొంత ఊరట లభించే అవకాశం ఉంటుందని అధికార యంత్రాంగం చెబుతున్నారు. అయితే ఆచరణలో భిన్నమైన ఫలితాలు ఉండటతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. సాధారణంగా ఏరువాక పౌర్ణమి నుంచి రైతులు వడివడిగా సాగు ప్రారంభిస్తారు. అధికారుల గణాంకాల ప్రకారం నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో 1.56 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాగు జరుగుతుందని అంచనా. ఎకరా సాగుకు అక్షరాలా రూ.30 వేలకుపైగా ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరా సాగుకు నాలుగు సార్లు దుక్కులకు రూ.4,600, విత్తనాలు, నార్లు, దశల వారీ కూలీల ఖర్చులు మరో రూ.7వేలు ఖర్చవుతోంది. కోత ఖర్చులు రూ.8,800, ఎరువులకు రూ.6,200, తొలి దశలో ఎరువులు, పురుగుల మందులకు రూ.3,600 ఖర్చు అవుతుంది. కౌలు రైతులకు భూమి కౌలు అదనంగా మారుతోంది. మొత్తం సాగు ఖర్చుల్లో 60 శాతానికిపైగా యంత్ర వినియోగానికి, రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వాలు ఒకవైపు యాంత్రీకరణ వైపు దృష్టి సారించాలని సూచిస్తుండగా రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో రైతులు సాగు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. నేల తల్లిని నమ్ముకున్న అన్నదాతలు ఏటా వ్యవసాయంలో నష్టాలే చవిచూస్తున్నారు. దుక్కులు దున్నడం మొదలుకుని పంటలు చేతికి వచ్చేంత వరకు యంత్రాలతోనే పనులు చేయించే రైతులకు పెట్టుబడి భారంగా మారుతుంది.
ఊరటనివ్వని ప్రభుత్వం పథకాలు
ప్రభత్వ పథకాలు తమకు ఊరట కల్పించడటంలేదని రైతులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికోసారి పిఎంకిసాన్‌, రైతు భరోసా పేరుతో రూ.13,500 మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. లీటరు పెట్రోల్‌ రూ.111కి చేరింది. డీజిల్‌ ధర రూ.99 దాటిపోయింది. రైతులపై అదనపు భారంట్రాక్టర్‌తో దుక్కి దున్నించడానికి పనిని బట్టి గంటకు అద్దె తీసుకుంటున్నారు. కల్టీవేటర్‌కు, డిస్క్‌లతో దున్నితే, రోటోవేటర్‌, ప్లవ్‌ వేసేందుకు చార్జీలు పెరిగిపోయాయి. ఒక ఎకరానికి సాగు చేసేందుకు రైతుకు కేవలం టాక్టర్‌ దున్నడానికి అదనంగా రెండు వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎకరం భూమి దున్ని సాగు చేసేందుకు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. నిత్యం డీజిల్‌ ధరలు పెరగడంతో టాక్టర్ల చార్జీలు పెరిగాయని రైతులు వాపోతున్నారు. గడిచిన వానాకాలం, రబీతో పోలిస్తే ప్రస్తుతం పంటల సాగుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. సొంత భూమి కలిగిన రైతుకు ఎకరా వరి సాగుకు రూ.30వేలు పెట్టుబడి ఖర్చు కాగా కౌలు రైతులకు మరో రూ.10వేలు అదనపు ఖర్చు పెరుగుతోంది. ఆరుగాలం కష్టం చేసినా ఆదాయం రాకపోగా నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవదేన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి
డీజిల్‌ ధరలతో పాటు ఎరువుల ధరలూ ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఆ స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఈ నేపధ్యంలో వ్యవసాయం ప్రతి ఏటా సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా ట్రాక్టర్‌తో 3 ఎకరాలు దున్నటానికి పదివేలకుపైగా ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభత్వుం మద్దతు ధరను నామమాత్రంగా పెంచింది. కానీ మిగతా అన్నిటికీ విపరీతమైన ఖర్చులవుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులకు భరోసా కల్గించేలా సాయం అందించాలి.
-కె. వెంకటేశ్వరరావు వరి రైతు కోరుకొండ