ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారు. గత నాలుగున్నరేళ్లుగా వివిధ రూపాల్లో తమ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వినతిపత్రాలు, నిరసనల రూపంలో తెలియచేశారు. అయినా జగన్ సర్కార్ నుంచి ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. పైగా ప్రజా ఉద్యమాలను నిషేధాలూ, క్రూర నిర్బంధంతో అణిచివేసేందుకు జగన్ ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదాన్ని మోపుతోంది. అయితే కార్మికోద్యమాల్ని, ప్రజా ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని చరిత్ర రుజువు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బెదిరింపులు, హెచ్చరికలకు భయపడి అంగన్‌వాడీలు వెనకడుగు వేయరని మరోసారి నిరూపించారు. అంగన్‌వాడీలు సోమవారం చలో విజయవాడకు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ వారిని గృహానిర్బంధాలు, అరెస్టులకు పాల్పడినా మొక్కవోని దీక్షతో పోలీసుల ఆంక్షలను నెట్టుకుని మరీ చలో విజయవాడకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ డిపోల వద్ద దొరికిన వారిని దొరికినట్లు ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విజయవాడకు వెళ్లకుండా అడ్డుకుని ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకూ అంగన్‌వాడీలను నిర్బంధించి వ్యక్తిగత పూచికత్తులతో విడుదల చేశారు. ఈ నిర్బంధాన్ని నిరసిస్తూ సోమవారం అంగన్‌వాడీలు రాజమహేంద్ర వరంలో శాంతియుత నిరసనకు సమాయత్తమయ్యారు. శ్యామలా సెంటర్లో ధర్నా ప్రారంభమైన కొద్ది సమయానికే పోలీసులు పలు రూపాల్లో అడ్డంకులు సృష్టించారు. ధర్నా ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని, లేనిపక్షంలో అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసుకునే హక్కు తమకు ఉందని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. ధర్నాను విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో టు టౌన్ సిఐ పి.గణేష్ ఆదేశాలతో పోలీసులు అంగన్‌వాడీలు, నాయకులపై దాష్టీకానికి పాల్పడ్డారు. కార్యకర్తల చేతుల్లో ఫ్లెక్సీలను లాక్కున్నారు. ప్రతిఘటించిన అంగన్‌వాడీలు, నాయకులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహానాల్లో పడవేశారు. ఈ పెనుగులాటలో కొంత మంది అంగన్‌వాడీలు, నాయకులు గాయపడ్డారు. పోలీసుల అత్యుత్సాహంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు భయానిక వాతావరణం నెలకొంది. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందర బాబు, బి.రాజులోవ, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌లతోపాటు, ఇతర నాయకులను అరెస్టు చేసి టూ టౌన్ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నాం 2.30 గంటల సమయంలో వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ విస్మరించారన్నారు. సిఎం హోదాలో నేడు అమలు చేయాలని కోరుతున్న అంగన్‌వాడీలను అణిచివేయడం సరికాదన్నారు. గ్రాడ్యూటీ ఇవ్వాలని, పేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం, నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, రాంబాబు, రాజా, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు మార్త, సుజాత, శారద, రామలక్ష్మి, పుష్ప, మరియమ్మ, తదితరులు ఉన్నారు. తాళ్లపూడి తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం విజయవాడలో తలపెట్టిన మహా ధర్నాను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తాళ్లపూడిలో అంగన్‌వాడీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి పైడిమెట్ట జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. కోర్కెల సాధన కోసం వివిధ రూపాలలో ఆందోళన కొనసాగిస్తామని సిఐటియు నాయకురాలు జ్యోతి అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు ఐ.రమణ, సిహెచ్ కనకదుర్గ, నాగలక్ష్మి పాల్గొన్నారు.










