Sep 25,2023 16:11

అంగన్‌వాడీలపై పోలీసుల దాస్టికం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
అంగన్‌వాడీలపై ఆందోళనపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అంగన్‌ వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపు ఇచ్చిన విషయం విధితమే. ఆ కార్యక్రమానికి మద్దతుగా నగరంలోని శ్యామల సెంటర్లో అంగన్‌వాడీలు సోమవారం ఉదయం 11 గంటలకు శాంతియుతంగా ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి సిఐటియు, సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు.ధర్నా ప్రారంభం ముందునుంచే పోలీసులు ఆంక్షలు పెట్టారు. ధర్నా ప్రారంభమైన కొద్ది సేపటికి అక్కడినుండి వెళ్లిపోవాలని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేసుకునే హక్కు తమకు ఉందని చెప్పటంతో పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. టు టౌన్‌ పోలీసు స్టేషన్‌ సిఐ పి గణేష్‌ ఆదేశాలతో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. తొలుత నాయకుల వద్ద నుంచి ఫ్లెక్సీలను లాక్కున్నారు. కార్యకర్తలను ఆక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈడ్చుకుంటూ వెళ్లి అప్పటికే ఏర్పాటు చేసిన బస్సుల్లో ఎక్కించారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. మహిళలను సైతం మహిళా పోలీసులు ఈడ్చుకెళ్లటంతో పలువురు కార్యకర్తలు ఆందోళనతో పరుగురు తీశారు. సుమారు 15 నిమిషాల పాటు పోలీసులు అక్కడ భయానక వాతావరణం సృష్టించారు. అనంతరం టు టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి 2.30 గంటలకు విడుదల చేశారు. శాంతియుతంగా జరుగుతు న్న ఆందోళనలను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయటాన్ని సిపిఎం, సిఐటియు నాయకులు ఖండించారు. అంగన్‌వాడీలకు జగన్‌ ఇచ్చిన హామీని అమలుచేయాలని, గ్రాడ్యూటీ ఇవ్వాలని, పేస్‌ యాప్‌ రద్దు చేయాలని, డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుందర బాబు, బి.రాజులోవ, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, రాంబాబు, రాజా,అంగన్వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మార్త, సుజాత, శారద,వున్నారు ఈ ధర్నా కార్యక్రమంలో రామలక్ష్మి, పుష్ప, సిఐటియు జిల్లా ఉపాధద్యక్షులు ఎస్‌ఎస్‌ మూర్తి, పుష్ప, మార్త, మరియమ్మ, శారదా,తదితరులు ఉన్నారు.