Jul 07,2023 00:12

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
అంగన్‌వాడీలకు సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలుచేయాలని, జులై 10,11వ తేదీల్లో అంగన్‌వాడీల 36గంటలకు మహాధర్నా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టరెట్‌ వద్ద నిర్వహిస్తున్నామని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మాణిక్యంబ, వై.బేబీరాణి అన్నారు. అంగన్‌వాడీల 36గంటల మహాధర్నా పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమొం గురువారం స్థానిక శ్యామల సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యంబ, బేబీరాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ వ్యవస్థ నిర్వీరియం చేయడానికి కుట్ర పన్నుతున్నాయన్నారు. అందులో భాగంగానే నూతనవిద్యా విధానం పేరుతో అంగన్‌వాడీలను పాఠశాలలో విలీనం చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌కి బడ్జెట్లో నిధులు కేటాయింపు తగ్గించి వర్కర్లకు, ఆయాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలు పెంచకుండా తగ్గిస్తున్నారని విమర్శించారు. మరో పక్క లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం నాణ్యత మరియు క్వాలిటీ పెంచాలనిడిమాండ్‌ చేశారు.అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంగన్‌వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానన్న సిఎం జగన్‌ ఇచ్చిన హామీని అమలూచేయాలన్నారు. చిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు వారి సమస్యల పరిష్కారం చేయలేదని అన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే నిర్బంధాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వేతనాలు తక్కువైనా పని ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉందని అన్నారు.రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, వేతనంతో కూడిన మెటర్నరీ లీవ్‌ ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ నివ్వాలని, అధికార రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌. ఎస్‌. మూర్తి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జిల్లా ఉపాధ్యక్షులు అన్నపూర్ణ, నాయకులు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ అన్నపూర్ణ, బి.రాజానగరం ప్రజాక్ట్‌ అధ్యక్షులు సుజాత, మరియు జిల్లాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.