Jan 29,2023 22:30

అమలుకు నోచుకోని కార్మిక హక్కులు
యాజమాన్యానికి లాభాలు... కార్మికులపై భారాలు
పరంపర-2 స్కీం పేరుతో అక్రమార్కులకు ఊతం
19 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల దీక్షలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ఆంధ్రా పేపర్‌ మిల్లు యాజమాన్యం పారిశ్రామిక, కార్మికుల చట్టాలకు తూట్లు పొడుస్తోంది. కార్మికుల పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ పూర్తి చట్టవ్యతిరేకమైన పద్ధతులకు పాల్పడుతోంది. దీనికి వ్యతిరేకంగా మిల్లులోని 8 కార్మిక సంఘాలు రాజమహేంద్రవరంలోని పేపరు మిల్లు గేటు ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి.
ఆంధ్రా పేపర్‌ మిల్‌కు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కడియంలో యూనిట్స్‌ ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ నుంచి 2019లో వెస్ట్‌ కోస్ట్‌ పేపర్స్‌కు చెందిన బంగూర్స్‌ దీనిని కొనుగోలు చేశారు. రాజమహేంద్రవరం విభాగంలో 700 మంది పర్మినెంట్‌ కార్మికులు, 1,300 మంది కాంట్రాక్టు కార్మికులు (కార్డ్‌ హోల్డర్స్‌) మరో 500 మంది కార్డ్‌ లేని కాంట్రాక్టు కార్మికులు మొత్తం కలిపి సుమారుగా 2500 మంది పనిచేస్తున్నారు. కడియం విభాగంలో పర్మినెంట్‌ కార్మికులు 300 మంది, ట్రైనీలు 130 మంది, కాంట్రాక్టు కార్మికులు దాదాపు 900 మంది వరకూ ఉన్నారు. కాంట్రాక్టు లేబర్‌ రెగ్యులేషన్‌ అండ్‌ అబాలిషన్‌ యాక్ట్‌-1970 ప్రకారం పరిశ్రమల్లో ఉత్పత్తి విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులు పనిచేయడం నిషేధం. కాని రాజహేంద్రవరం పేపర్‌ మిల్లులోని అన్ని కోర్‌ ఉత్పత్తి విభాగాల్లోనూ కాంట్రాక్టు కార్మికులు 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. చట్ట ప్రకారం పరిశ్రమలో ఉత్పత్తి విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలి. కాని యాజమాన్యం ఈ విషయాన్ని అసలు పట్టించుకోవట్లేదు.
కార్మికుల హక్కులు బుట్టదాఖలు
ప్రతి రెండేళ్లకు ఒక సారి పరిశ్రమలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయి. గుర్తింపు సంఘం యాజమాన్యంతో వేతనాలు, ఇతర సమస్యల చర్చలు జరిపిన తరువాతనే ఒప్పందం చేసుకోవాలి. వేతన ఒప్పందం ప్రతి మూడున్నరేళ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే మూడేళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరగకపోవడంతో పర్మినెంట్‌ కార్మికుల నూతన వేతన ఒప్పందం కూడా పెండింగ్‌లోనే ఉంది. పాత వేతన ఒప్పందం 2020 జూన్‌లోనే పూర్తి అయ్యింది. దాదాపు 32 నెలలు గడిచినా కొత్త వేతన ఒప్పందం లేక ఒక్కో కార్మికుడు రూ.11వేల చొప్పున నష్టపోయారు. మొత్తంగా గడిచిన 32 నెలల్లో రూ.24.64 కోట్లను ఈ ఫ్యాక్టరీ కార్మికులు నష్టపోయారు. 84 మంది కాంట్రాక్టు కార్మికులను ట్రైనీలుగా తీసుకుని పర్మినెంట్‌ చేసే విషయంలో సీనియారిటీ లిస్ట్‌లో ఉన్న నలుగురు మహిళ కార్మికులను కేవలం లింగ వివక్షతతో యాజమాన్యం పక్కనబెట్టింది. 55 మంది బదిలీలను రిక్రూట్‌ చేసుకునే సందర్భంలో కూడా కాంట్రాక్టు కార్మికల్లో సీనియారిటీని ఉల్లంఘించింది. కాంట్రాక్టు కార్మికులను కాకుండా బయటి వారిని రిక్రూట్‌ చేసుకుని కాంట్రాక్టు కార్మికులకు నష్టం చేసింది. కోర్‌ విభాగాల్లో భర్తీలో కాంట్రాక్టు కార్మికుల వయసు 53 ఏళ్లుమించకుండా తీసుకుంటామని యాజమాన్యం మినిట్స్‌లో అంగీకరించినప్పటికీ దాన్ని 45 ఏళ్లకు తగ్గించింది.
పరంపర-2 స్కీం పేరుతో అక్రమార్కులకు ఊతం
2017 ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన పేపర్‌ మిల్‌ కార్మిక సంఘం ప్రతినిధి, మిల్లు యాజమాన్య ప్రతినిధి కలిసి అక్రమాలకు తెరలేపారని కార్మిక సంఘాల చెబుతున్నాయి. 2019లో అప్పటి గుర్తింపు సంఘంతో జరిగిన 12(3) ఒప్పందంలో కాంట్రాక్టు కార్మికులను 54 మందిని సీనియారిటీ ఆధారంగా ఇన్‌ప్లాంట్‌ ట్రైనీలుగా తీసుకోవడానికి, అదే విధంగా 55 మందిని బదిలీలుగా తీసుకోవడానికి, కొర్‌ విభాగాల్లో 55 ఖాళీలను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయడానికి ఒప్పందం జరిగింది. గత గుర్తింపు సంఘం కాలపరిమితి 2019లో ముగిసింది. దీంతో కార్మిక శాఖ 2020 జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియ ప్రారంభించింది. ఓటర్ల జాబితా కూడా ఇచ్చారు. ఈ లోగా కోవిడ్‌ను సాకుగా చూపి గత గుర్తింపు సంఘం ప్రతినిధి ఎన్నికలు జరగకుండా హై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కార్మిక శాఖను, యాజమాన్యాన్ని కౌంటర్‌ దాఖలు చేయమని కోరింది. కానీ ఎన్నికల ప్రక్రియ నిలుపుదలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ కోర్ట్‌ను సాకుగా చూపి మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించడంలేదు. ఈ కాలంలో పరంపర-1 పేరుతో పర్మినెంట్‌ కార్మికులను 60 మందిని ఏడాది, రెండేళ్లుసర్వీస్‌ ఉన్న వారిని రాజీనామా చేస్తే వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు విన్పించాయి. పరంపర-2లో కార్మికుల పిల్లలు అనే విధానం కూడా పక్కకి పోయి బాహాటంగా ఉద్యోగాలు అమ్మకం పెట్టేశారు. ఒక్కో పోస్టు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున విక్రయించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉద్యోగులు రాజీనామా చేస్తే వదులుకున్న సర్వీస్‌ కాలానికి యాజమాన్యం ఎలాంటి పరిహారం ఇవ్వటంలేదు. ఇలా దాదాపు 150 పోస్టులు అమ్మేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నిరంకుశంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం
ఆంధ్ర పేపరు మిల్లు యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కార్మికచట్టాలను, న్యాయస్థానం తీర్పులను సైతం ఖాతరు చేయటంలేదు. పరంపర పేరుతో పోస్టులు అమ్ముకుంటూ అనుభవం నైపుణ్యం లేని వారిని విధుల్లోకి తీసుకుంటుంది. దీని వల్ల పరిశ్రమ భద్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కార్మికుల న్యాయ బద్ధమైన హక్కులను కల్పించడంలో నిర్లక్ష్యం సరైంది కాదు. యాజమాన్యం ఘర్షణ వైఖరి అవలంభించటం తగదు.కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలి. లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
- టి. అరుణ్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు