ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా ఇప్పటికిప్పుడు అర్థాంతరంగా జియోన్ అంధుల పాఠశాలను తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, కాంగ్రెస్ నాయకుడు బోడా వెంకట్ హెచ్చరించారు. జియోన్ అంధ విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడారు. మెడికల్ కాలేజీకి తాము వ్యతిరేకం కాదని, కాని అంధ విద్యార్థులను రోడ్డున పడేయడం సమంజసం కాదన్నారు. అంధ విద్యార్థులపై ప్రతాపం చూపించాలనుకోవడం ఎంపీ మార్గాని భరత్‌కు తగదని హితవు పలికారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ అంధ విద్యార్థులను రాత్రికి రాత్రి రోడ్డున పడేయాలనుకుంటున్న ప్రభుత్వ విధానాలను తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. టిడిపి నాయకులు దుత్తరపు గంగాధర్, కె.శ్యామల, ఆకుల విజయభారతి, కానేటి ప్రభుదాస్, షేక్ మదీనా సాహెబ్, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.










