Feb 27,2023 22:21

అందని మినీ గోకులాల బిల్లులు

ప్రజాశక్తి-కడియం పాడి ద్వారా సంపదతోపాటు, వ్యవసాయ పనుల్లో సాయమందించే పశువులతో రైతన్నది విడదీయరాని బంధం. తరతరాలుగా పశువులు, వాటి పోషణ గురించి రైతులు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. పశు సంపద వల్లే గ్రామాల్లో కొన్ని కుటుంబాలు జీవనోపాధి పొందుతుంటాయి. పశువుల కోసం తాటాకు పాకల స్థానంలో గట్టి షెడ్లు నిర్మించుకొనేందుకు 2018లో కేంద్రప్రభుత్వం రైతుల కోసం మినీ గోకులాలు మంజూరు చేసింది. 10 శాతం పెట్టుబడి ముందుగా రైతులు డిడి ల రూపంలో పశుసంవర్థక శాఖకు చెల్లించారు. 2 పశువుల మినీ గోకులానికి రూ.లక్ష, 4 పశువుల మినీ గోకులానికి రూ.1.5 లక్షలు, 6 పశువుల మినీ గోకులానికి రూ.1.8 లక్షలు జాతీయ ఉపాధి హామీ చట్టం నిధులు మంజూరవుతాయని సంబంధిత అధికారులు అవగాహనా సదస్సుల ద్వారా పాడి రైతులకు వివరించారు. నిర్మాణాలు చేపడితే వెనువెంటనే విడతల వారీగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు చెల్లించిన 10 శాతం దరావతు కూడా తిరిగి బిల్లులతో కలిసి ఇస్తారని రైతులకు తెలిపారు.
తాటాకు పాకలు రానురానూ అధిక ఖర్చులతో కూడుకోవడం, తరచూ అగ్నిప్రమాదాలకు గురికావడం తదితర అంశాల కారణంగా రైతులు షెడ్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. మినీ గోకులాలు నిర్మించారు. 90 శాతం నిధులు ఉపాధి హామీ చట్టం పధకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు నానా అవస్థలూ పడుతున్నారు. అప్పులుచేసి మరీ షెడ్లు నిర్మించామని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం ద్వారా కూలి పనులు, మెటీరియల్‌ కాంపోనెంట్లుగా చెల్లించాల్సి ఉండగా కనీసం కూలి పనులు కూడా అధిక శాతం మందికి చెల్లించకపోవడంతో పాడి రైతులు అయోమయానికి గురవుతున్నారు. కొందరైతే అప్పులు తీర్చే మార్గంలేక పాడి పశువులను అమ్మేసిన ఘటనలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం తమ పరిస్థితి పాకలు పీకి పందిరేసినట్టుగా ఉందని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వాకం వల్ల పశువులు లేక , పశుసంపద లేక కుటుంబపోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు.
వైఎస్‌ఆర్‌ పశు నష్టపరిహారం
గతంలో పాడి రైతులు సొంతంగాను, మరికొంతమంది ప్రయివేటు మిల్క్‌ డెయిరీల భాగస్వామ్యంతో సంయుక్తంగా తమ పశువులకు బీమా ప్రీమియం చెల్లింపులు చేసుకునేవారు. ఎప్పుడైనా పశువులు చనిపోతే రోజుల వ్యవధిలోనే బీమా కంపెనీల నుంచి పూర్తిస్థాయి నష్టపరిహారం రైతుకు అందేది. ప్రస్తుత ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు రైతులకు భారం కాకూడదనే ఉద్దేశంతో నేరుగా ప్రభుత్వమే పూర్తిస్థాయి బీమా చెల్లింపులు చేపట్టింది. గరిష్ఠంగా ఒక్కో పశువుకు రూ.30 వేలు, కనిష్టంగా రూ.15 వేలు నష్టపరిహారం అందేలా ఏర్పాట్లు చేసింది. పథకం ప్రవేశపెట్టిన తొలినాళ్లలో పశువులు నష్టపోయిన రైతులకు నగదు చెల్లింపులు జరిగాయి. మూడేళ్లుగా పశు నష్టపరిహారం చెల్లింపులు నిలిచిపోవడంతో పాడి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం మేలు చేస్తుందని నమ్మామని, అరకొర నష్టపరిహారానికి పరిమితం చేసిందని, అయినా గత మూడేళ్లుగా చెల్లింపులు నిలిపేసిందని వాపోతున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉందని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, తక్షణం స్పందించి షెడ్లు, పశు నష్టపరిహారం నిధుల చెల్లింపులు త్వరగా చేపట్టి , మమ్ములను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు ముక్త కంఠంతో వేడుకొంటున్నారు.