Aug 27,2023 22:19

ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు

వాదాలకుంటలో ఘటన
ఆందోళనకు దిగిన దళిత సంఘాలు
ప్రజాశక్తి - గోపాలపురం
వాదాలకుంట హైస్కూల్లో ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌, అంబేద్కర్‌ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దేవరపల్లి సిఐ అనసూరి శ్రీనివాసరావు, నల్లజర్ల ఎస్‌ఐ నున్న రాజుతో పాటు గోపాలపురం, తాళ్లపూడి ఎస్‌ఐలు, సోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 24 గంటల్లోగా పట్టుకుంటామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు. దళిత సంఘం నాయకులు, యువకులు పెద్ద ఎత్తున వాదాలకుంట నుంచి గోపాలపురం వరకు బైకులపై ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని అంబేద్కర్‌, జగజ్జీవన్‌ రావ్‌ విగ్రహాలకు ముసుగులు వేసి నిరసన తెలిపారు. గోపాలపురం చెక్‌ పోస్ట్‌ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. డిఎస్‌పి అక్కడికి చేరకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు ఘటనకు చేరుకుని మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి హై స్కూల్లో ఇప్పటికే వాచ్‌మెన్‌లను నియమించామని, త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధ్వంసంమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంఎల్‌ఎ ఆధ్వర్యంలో చెక్‌ పోస్ట్‌ సెంటర్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి నల్ల ముసుగులు తొలగించి, పూలమాలలు వేశారు. దీంతో ఆందోళన విరమించారు.