Apr 02,2023 22:45

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

'చలో ఢిల్లీ' పోస్టర్‌ ఆవిష్కరణలో వక్తలు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
అంబానీ, అదానీల కోసమే మోదీ పాలను సాగుతుందని, వారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకే 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పలువురు వక్తలు అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధిచిన పోస్టర్‌ను స్థానిక శ్యామల సెంటర్‌లో సిఐటియు జిల్లా నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది మొదలు కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరిందన్నారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సంపదను విదేశీ, స్వదేశీ సంస్థలకు అప్పగించి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లుకు అప్పగించేందుకు భారత వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసిందన్నారు. రైతాంగం పోరాటంతో వెనక్కి తగ్గిందన్నారు. మోదీ పాలనలో రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయన్నారు. రూ.400 ఉన్న గ్యాస్‌ బండ రూ.1,200కి చేరిందనానరు. రూ.55 ఉండే లీటర్‌ పెట్రోల్‌ నేడు రూ.110 దాటిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశనకర విధానాలకు నిరసనగా సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల 'చలో ఢిల్లీ'కి పిలుపునిచ్చాయన్నారు. దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతన రూ.26వేలు, కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందని పర్మినెంట్‌ చేయాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, ఉపాధి హామీ పనికి కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు, రైతు సంఘం నాయకులు పడాల రామకృష్ణ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, సిఐటియు నాయకులు అప్పల నరసయ్య, సోమేశ్వరరావు, లవకుమార్‌, జి.తాతారావు తదితరులు పాల్గొన్నారు.