మోడీ పాలనలో ప్రజల అభివృద్ధి క్షేణిస్తుంది
సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్
రాజమహేంద్రవరం : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక శ్యామలా సెంటర్ వద్ద సిపిఎం కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు టిఎస్.ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడారు. లక్షలాది అమర వీరుల త్యాగల ఫలితంగానే మన దేశానికి బ్రిటిష్ సామ్రాజ్య వాదుల నుంచి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అటువంటి త్యాగాల నుంచి వచ్చిన స్వాతంత్య్ర దేశంలో నేటికీ ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రం మెజారిటీ ప్రజలకు అందలేదన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను కొద్ది మంది కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతుందని విమర్శించారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో దేశంలో అక్షరాశ్యత, మానవ అభివృద్ధి, ఉద్యోగ కల్పన, మతపరమైన ఆంక్షలు, పౌర హక్కులు, శాంతి భద్రతలు, పత్రికా స్వేచ్చా, వాక్ స్వాతంత్య్రం, మేధావి వర్గంపై దాడులు, అణచివేతలు, రాజకీయ సంస్కృతి, బహుళత్వం, పాలనలో ప్రజల భాగస్వామ్యం, అవినీతి, నేరాలు, ఎన్నికల ప్రక్రియ వంటి సూచికలు దిగజారిపోతున్నాయని తెలిపారు. ప్రజల మధ్య మతపరమైన విభజనలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వమే కారణం కావడం ప్రమాదకరమైన అంశమన్నారు. అనేక అంశాలలో ప్రజలకు వాస్తవ గణంకాలు తెలియజేయకుండా దాచిపెట్టడం, ప్రశ్నించేవారిపై దాడి చేయడం, బాధ్యతల నుంచి తొలగించడం లాంటివి చేస్తున్నారని విమర్శించారు. మన దేశం లౌకిక రాజ్యంగా ఉండాలని అప్పుడే ఆధునిక ప్రపంచంలో దేశం సముచిత స్థానం సంపాదించగలుగుతుందని, వేగంగా అభివద్ధి చెందగలుగుతుందని స్వాతంత్య్ర సమర యోధులు, అశేష ప్రజానీకం, సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీలు స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా బలంగా కోరుకున్నారన్నారు. మనువాదం, కుల వ్యవస్థ అంతం ద్వారానే మన దేశం సర్వతోముఖాభివద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, నాయకులు బి.రాజులోవ, ఎస్‌ఎస్.మూర్తి, పి.వెంకటేశ్వరరావు, టి.సావిత్రి, ఐ.సుబ్రహ్మణ్యం, అప్పలనర్సయ్య, వై.రాము, సోమేశ్వరరావు, రాంబాబు, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










