Mar 04,2023 22:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లాలో 229.09 ఎకరాల్లో నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలోని చెరువులను రెండే ఫేజ్‌లో ఆక్వా జోన్‌లోకి మార్పు చేసినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు డిఎల్‌ఎస్‌లో రెండు ఫేజ్‌లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలను ఆక్వా జోన్‌లోకి మార్చామన్నారు. శనివారం కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లా మత్స్యశాఖ అధికారి కెవి.కృష్ణారావు, ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి 2వ ఫేజ్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మత్స్య రంగానికి మరింత ప్రోత్సాహం అందించి మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆదిశగా జిల్లా స్థాయి కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో గుర్తించిన 9 మండలాల్లో 29 గ్రామాల్లో 1,197.02 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 967.93 ఎకరాలను జిల్లాలోని నాన్‌ ఆక్వాజోన్‌ నుంచి ఆక్వా జోన్‌గా మార్చేందుకు ఫేజ్‌-1లో ఆమోదించామన్నారు. ఇంకా జిల్లాలో 1,529 ఎకరాలు నాన్‌ ఆక్వా జోన్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రామ సభలో ఆమోదం పొందని కారణంగా అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.మాధవరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఎస్‌టిజి.సత్యగోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.