May 01,2023 23:38

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు రైతులను అప్రమత్తం చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో అకాల వర్షాలపై అధికారులతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈరోజు నాటికి కోతలు పూర్తిచేసి, కొనుగోలుకు షెడ్యూలింగ్‌ ఇచ్చిన ధాన్యం మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు సుమారు లక్షా 12 వేల మెట్రిక్‌ టన్నుల్లో లక్షా మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని, వాటిని మిల్లులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న నాలుగు రోజులు వర్ష సూచన మేరకు కోతలు పూర్తి చేసిన రైతుల నుంచి వారి అంగీకారంతో ఆఫ్‌ లైన్‌ ద్వారా కొనుగోళ్లు పూర్తి చేసి, మిల్లులకు తరలించే విధంగా అధికారులు బాధ్యత చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌. మాధవరావు మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షపాతానికి వరి పంటలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు వివరించారు. రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని టార్పాలిన్‌తో కప్పుకొని తడవకుండా జాగ్రత చేసుకుని సురక్షిత ప్రదేశానికి తరలించాలన్నారు. మిల్లుకు షెడ్యూల్‌ ప్రకారం పంపిణీ చేయాలన్నారు. ఇప్పటి వరకు పొలంలో కోయని వరిని వర్షాలు తగ్గేవరకు కోయవద్దని, పొలంలోని నీరు బయటకు పొయే విధంగా రైతులు తగు జాగ్రత తీసుకొవాలన్నారు. ధాన్యం మొలక రాకుండా 5శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసి మొలక రాకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ జి.నరసింహులు, సిపిఒ ప్రకాశరావు, డిఎస్‌ఒ ప్రసాదరావు పాల్గొన్నారు.
స్పందనలో 30 అర్జీలు
ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత, డిఆర్‌ఒ నరసింహులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్‌ కాకుండా పటిష్టవంతంగా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలన్నారు. ఈ రోజు స్పందనలో ఆన్‌ ద్వారా 27 ఆఫ్‌ లైన్‌ ద్వారా 3 మొత్తం 30 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన విధంగా అర్జీల పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. స్పందన ద్వారా అయితే అర్జీలను స్వయంగా దరఖాస్తు చేసుకుంటారని, కానీ ఈ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో అర్జీదారుడు సమస్యను 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా నమోదు చేయవచ్చునన్నారు. ప్రజల యొక్క ప్రతి అర్జీని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో డిఆర్‌ఒ జి.నరసింహులు, వి.స్వామినాయుడు, డిసిహెచ్‌ఒ డాక్టర్‌ ఎం.సనత్‌ కుమారి, సిపిఒ కె.ప్రకాష్‌ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌.మాధవరావు, డిహెచ్‌ఒ వి.రాధాకష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్‌జిటి సత్యగోవిందం, డ్వామా పీడీ జిఎస్‌.రామగోపాల్‌ పాల్గొన్నారు.