ప్రజాశక్తి-గోపాలపురం పురుగుమందులు అధిక మోతాదులో వాడటం వల్ల పంటలకు మేలు చేసే మిత్ర పురుగులను కోల్పోతామని పెద్దాపురం ఏరువాక వ్యవసాయం కేంద్రం శాస్త్రవేత్త నరసింహారావు అన్నారు. గురువారం మండలంలోని వెంకటాయపాలెంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మంచి వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాల్లో నిర్వహిస్తున్న వైయస్సార్ క్లస్టర్ పొలంబడి క్షేత్రాలను పెద్దాపురం ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా వనరుల కేంద్రం డిడి ఎ.బోసుబాబు, వ్యవసాయ సంచాలకులు పి.చంద్రశేఖర్, ఎఒ రాజారావు ఆధ్వర్యంలో సందర్శించారు. అనంతరం వారు రైతులతో మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వరి పొలంలో మిత్ర పురుగులు ఎక్కువగా, వాటికి హాని చేసే శత్రు పురుగులు తక్కువగా ఉన్నాయని, కావున సస్యరక్షణ చర్యలు అవసరం లేదని తెలిపారు. మిత్ర పురుగులను సంరక్షించుకోవాంటే అత్యంత విషపూరితమైన పురుగుమందులను వాడకూడదని సూచించారు. తక్కువ మోతాదులో ఉండే వేప కషాయాలను, వేప నూనెను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఒ బి.రాజారావు పాల్గొన్నారు.










