ప్రజాశక్తి- నల్లజర్ల అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు గ్రామ గ్రామానికీ పరుగులు పెడుతున్న తమను తక్షణమే ఆదుకోవాలని 104 ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. ప్రకాశరావుపాలెంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్లేకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 104 ఉద్యోగులను కాంట్రాక్టు లేదా ఆప్కాస్‌లో కలిపి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నెల జీతం మీదనే ఆధారపడి బతుకుతున్న చిరుద్యోగులమైన తమకు నెలవారీ అందాల్సిన జీతం కూడా సక్రమంగా అందకపోవడంతో అర్ధాకలితోనే తమ కుటుంబాలు కాలం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతినెలా సక్రమంగా వేతనాలు చెల్లించాలని, ఇప్పటివరకూ పేరుకుపోయిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలని కోరారు. 104 పైలట్ బి.నరేష్, డిఇఒ జి.సుమలత ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు జివివి.ప్రసాద్ మద్దతు తెలిపారు.










