May 09,2023 00:24

ఆదిరెడ్డిపై కేసులను తక్షణం ఎత్తివేయాలి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన టిడిపి సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌(వాసు)పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని రాజమహేంద్రవరం అఖిలపక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. స్థానిక ఆనం రోటరీ హాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన సోమవారం అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం, బిఎస్‌పి, ఆప్‌, న్యాయవాద సంఘాలు, ప్రజాసంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకష్ణ రెడ్డి (టిడిపి), మాజీ ఎంఎల్‌సి కందుల దుర్గేష్‌ (జనసేన), బాలేపల్లి మురళీధర్‌ (కాంగ్రెస్‌), బి.పవన్‌ (పిపిఎం), అతిల రాజు (ఆమ్‌ ఆద్మీ), శ్రీను (బిఎస్‌పి), మేడా శ్రీనివాస్‌ (ఆర్‌పిసి), కిరణ్‌ (న్యూడెమోక్రసీ) మాట్లాడారు. నాలుగేళ్లుగా ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కడమే లక్ష్యంగా పని చేస్తోందనప్నారు. 40 ఏళ్లుగా ఆదిరెడ్డి కుటుంబం ప్రభుత్వ నిభందనల ప్రకారం వ్యాపారం సాగిస్తున్నారని, ఏ రోజు ఏ వ్యక్తి ఫిర్యాదు చేయలేదని, అటువంటిది ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ వేధింపుల్లో భాగంగా అక్రమంగా అరెస్ట్‌ చేయించిందన్నారు. ఈ సమావేశంలో వేణుగోపాలరాయుడు, నవీన్‌ కుమార్‌, మణేశ్వరరావు, కుండ్రపు రాంబాబు, వి.కొండలరావు, సప్పా రమణ, అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు.