Mar 28,2023 23:00

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ
ప్రజాశక్తి - సీతానగరం, చాగల్లు
మోదీ పాలనా అదానీ కోసమా? లేక ప్రజల కోసమా? అనేది తేల్చుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదరి రాజులోవ ప్రశ్నించారు. మంగళవారం సీతానగరం మండలం బొబ్బిళ్లంకలో చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆయన సిఐటియు నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజులోవ, లక్ష్మి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరిందన్నారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ దాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సంపదను ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి నిరుద్యోగాన్ని పెంచేశారన్నారు. మోడీ పాలనలో రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయన్నారు. గ్యాస్‌ బండ రూ.1,200కి చేరిందన్నారు. పెట్రోల్‌ నేడు లీటర్‌ రూ.110 దాటిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశనకర విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5న సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ.26వేలు, కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలని, అన్ని డిపార్ట్‌మెంట్లలో పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, ఉపాధి హామీ పనికి కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు ప్రయివేటీకరణను ఆపాలని, నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.
చాగల్లులో సిఐటియు, ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా అద్యక్షుడు ఎం.సుందర్‌బాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడిచారన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు, కనీస పింఛను రూ.10వేలు అందించాలన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, ,టైం స్కేల్‌, డైలీ వైజ్‌, గౌరవ వేతన కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలన్నారు. నిత్యావసరాలపై జిఎస్‌టిని ఉపసంహరించాలని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌లపై జిఎస్‌టిని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న జరిగే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని నినదించారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో సిఐటియు చాగల్లు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస.కె.ఆదామ్‌, కెకె.దుర్గారావు, ఎపి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ గారపాటి సుబ్బారావు, కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు కంకటాల బుద్ధుడు, బేవరేజస్‌ నాయకులు చింతలపూడి నాగేశ్వరరావు, కార్యదర్శి బి.రమేష్‌ పాల్గొన్నారు.