Aug 04,2023 23:52

నిర్మాణాలను పరిశీలిస్తున్న హర్షకుమార్‌, అరుణ్‌ తదతరులు

తక్షణమే సుబ్రహ్మణ్య మైదానంలో నిర్మాణాలు
నిలిపివేయాలి
లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధం
స్పష్టం చేసిన అఖిల పక్ష పార్టీల ప్రతినిధులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
అధికార పార్టీ నేతలు అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల అవినీతితో పాటుగా చారిత్రక విధ్వంసానికి పాల్పడటం సిగ్గుచేటని అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు అన్నారు. నగరంలోని బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్య మైదానంలో జరుగుతున్న నిర్మాణాలను అఖిల పక్ష పార్టీల నేతలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి హర్షకుమార్‌ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య మైదానం చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. స్వాతంత్య్ర పోరాట కాలంలోనూ, స్వాతంత్య్రానంతరం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సభలకు ఈ మైదానం వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఆ ప్రాంగణంలోని విక్రమ హాలు, ట్రినిటి చర్చిలు శతాబ్ధాల కాలం నాటివి అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి వేదికను నిర్మించారని ఆ నిర్మాణాలను కూల్చి వైఎస్‌ పేరుచెప్పి ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ ఎంపీ భరత్‌కుమార్‌, కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలు చేయటం సరైంది కాదన్నారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సుబ్రహ్మణ్యం, గరికపాటి రాజారావు అందించిన సేవలను గుర్తు చేశారు. అటువంటి వారి పేర్లను తొలగించి సిటిస్క్వేర్‌ పేరుతో రూ.కోట్లు వెచ్చించి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అనేక సభలకు, సమావేశాలకు వేదికగా నిలిచిన ఆ ప్రాంగణం భవిష్యత్తులో పూర్తిగా దూరం కానుందని వివరించారు. తక్షణమే నిర్మాణాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌కు శనివారం వినతిపత్రం అందజేయనున్నామని తెలిపారు. మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అఖిల పక్ష పార్టీలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారని పాలకులను ప్రశ్నించారు. నగరంలోని హ్యాపీ స్ట్రీట్‌, రహదారుల మధ్యలో డివైడర్‌ల ఏర్పాటు వంటివాటికి సరైన ప్రణాళికలు లేవని తెలిపారు. వైసిపి పాలనలో నగరంలో అనేక స్థానిక సమస్యలు తిష్టవేశాయని వాటిని పరిష్కరించడటంలో ఘోరంగా విఫలమయ్యారని వివరించారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి.మధు మాట్లాడుతూ ఎంపీ భరత్‌కు రాజకీయ విజ్ఞానం లేదన్నారు. మైదానంలో జరుగుతున్న నిర్మాణాలు తక్షణమే నిలుపుదల చేయాలని లేని పక్షంలో రాజమహేంద్రవరంలోని ప్రజలను, ప్రజా, ఉద్యోగ, కార్మిక సంఘాలను కదిలించి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ నగర నాయకులు మురళి, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌ మాట్లాడారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజులోవ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌ రాజా, సిఐటియు జిల్లా నాయకులు రామకృష్ణ, టిడిపినాయకులు రెడ్డి మణి తదితరులు పాల్గొన్నారు.