ప్రజాశక్తి - యంత్రాంగం
మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత ఎపిజె అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కడియం అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఆదివారం వేమగిరి బుద్ధ విహార్లో మైత్రేయి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి, కళాశాల సమితి అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాసరావు కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు మర్రి సుబ్రహ్మణ్యం, రచయిత గౌరవ్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పిఎస్‌ఎన్ రాజు, రాజేంద్ర, మూర్తి, పత్తిపాటి నల్లరాజు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి విసి పద్మరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ డిఎల్‌ఆర్‌లో ఎంటెక్ ప్రాజెక్టు వర్క్ చేస్తున్న సమయంలో అబ్దుల్ కలాంను తరచూ చూసేవారమని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసు కుని సమాజహితంగా ముందుకు సాగా లని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధి కారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. చాగల్లు స్థానిక చంద్రవరం శాఖా గ్రంథాలయంలో అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి గ్రంథ పాలకులు గద్దె శ్రీనివాస్, సుమన్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెరవలి మండలంలోని ముక్కామలలోని ఇనుపకోళ్ల రాఘవరావు మెమోరియల్ గ్రామీణ శాఖా గ్రంథాలయంలో అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అభివృద్ధి కమిటి అధ్యక్షులు కడియాల సాయిరామారావు, రిటైర్డ్ ఎంఇఒ .నల్లా సత్యనారాయణ, గ్రంథాలయాధికారి ఎం.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. సీతానగరం అబ్దుల్ కలాం జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో సీతానగరం సూర్యచంద్ర స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గీతిక, మహితా చౌదరి, శ్రావ్య, లక్ష్మీ దుర్గ బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలను పాఠశాల ఛైర్మన్ కనికిరెడ్డి, కరస్పాండెంట్ లక్ష్మీప్రసన్న, హెచ్‌ఎం ఫణీంద్ర రావు, ఉపాధ్యాయులు సుమంత్, రామకష్ణ అభినందించారు.










