Aug 02,2023 10:23
  • రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి
  • పలుచోట్ల అరెస్టులు, విడుదల

ప్రజాశక్తి-యంత్రాంగం : కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, గత ఎన్నికల ముందు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు మంగళవారం కదంతొక్కారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించారు. పలు జిల్లాల్లో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఏలూరు కార్పొరేషన్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది. దీంతో రెండుగంటలపాటు మున్సిపల్‌ కార్యాలయ సిబ్బంది గేటుబయట రోడ్లపైనే నిలబడిపోయారు. కార్యాలయ విధులు స్తంభించాయి. ఈ సదర్భంగా ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా, అసెంబ్లీలోనూ, బయట మున్సిపల్‌ కార్మికులకు అనేక హామీలిచ్చారన్నారు. ఆ హామీలను నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ అమలు చేయలేదని, అందుకే మున్సిపల్‌ కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నెల 7న కలెక్టరేట్లను ముట్టడిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 17న చలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలో నగర పంచాయతీ కార్మికులు, సిఐటియు నాయకులు మున్సిపల్‌ ఆఫీసును ముట్టడించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన సిఐటియు నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కార్మికుల ఆందోళనతో కొద్దిసేపటికి వారిని విడిచిపెట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపల్‌ కార్యాలయాలను మున్సిపల్‌ కార్మికులు ముట్టడించారు. విధులకు హాజరైన ఉద్యోగులను కార్యాలయాల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాంతో పాటు 132 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో 87 మందిని, ఆమదాలవలసలో 15 మందిని, పలాసలో 30 మందిని అరెస్టు చేసి ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కార్పొరేషన్‌ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కమిషనర్‌ వెంకటేశ్వరరావు ఆందోళనకారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎప్పటిలోగా పరిష్కరిస్తారో తెలియజేస్తూ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టడంతో తమ సిబ్బంది రాసి ఇస్తారంటూ కమిషనర్‌ అక్కడ నుంచి వెళ్లిపోయారు. కమిషన్‌ తీరును నిరసిస్తూ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు యూనియన్‌ నాయకులను అరెస్టు పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కార్మికులు అడ్డుగా నిలిచారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూనియన్‌ నాయకులు, కార్మికుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పరుస పదజాలంతో దూషించారు. కార్మికులను బూటుకాళ్లతో తొక్కుతూ బలవంతంగా అక్కడ నుంచి నెట్టేశారు. యూనియన్‌ నాయకులను వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తరువాత విడిచిపెట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించి అక్కడే వంటావార్పు నిర్వహించారు. సత్తెనపల్లిలో మున్సిపల్‌ కార్యాలయం మెయిన్‌ గేటు ఎదుట కార్మికులు బైఠాయించారు. ఉద్యోగులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్మికుల ఆందోళనతో వారిని విడుదల చేశారు. గుంటూరులో నగరపాలక సంస్థ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. విజయనగరం జిల్లాలోని విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం, రాజాం, నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయాల వద్ద కార్మికులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. విజయనగరంలో మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్‌మోహన్‌రావు మాట్లాడారు. బొబ్బిలిలో మున్సిపల్‌ కార్యాలయానికి కార్మికులు గేట్లు వేసి బైఠాయించడంతో మున్సిపల్‌ చైర్మన్‌ వెంకట మురళీకృష్ణ, ఉద్యోగులు, కౌన్సిలర్లు బయటే ఉండిపోయారు. మున్సిపల్‌ చైర్మన్‌ను అడ్డుకోవడంతో పోలీసులు కార్మికులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో 26 మందిని, పాలకొండలో 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పెద్దబోడ్డేపల్లి సెంటర్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించి మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. కోనసీమ జిల్లా మండపేటలో ర్యాలీ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. నాయుడుపేటలో వంటావార్పు చేసి నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో కార్మికులు మున్సిపల్‌ కార్యాలయాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కృష్ణా, నెల్లూరు, కడప, కూర్నూలు, నంద్యాల జిల్లాలో ఆందోళనలు చేపట్టారు.