Apr 06,2023 15:31

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : వచ్చే విద్యా సంస్థల ఆరంభానికే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోందని, సమగ్ర శిక్ష అభియాన్‌ జిల్లా కమ్యూనిటీ మొదలైజేషన్‌ అధికారి కే.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష అభియాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి జె.స్నేహలత కడియం ఒకటో నెంబర్‌ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పాఠ్య పుస్తకాలు, నోట్సులు తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌తో 9వ తరగతి పాఠ్య పుస్తకాలు రానున్నాయన్నారు. పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, దుస్తులు విద్యా సంవత్సరం ఆరంభం నాటికే విద్యార్థులకు చేరతాయన్నారు. ప్రభుత్వం అందించే ఆరోగ్య పరీక్షలు కూడా విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే.లక్ష్మణకుమార్‌, చిలుకూరి శ్రీనివాసరావు, మండల కంప్యూటర్‌ కో-ఆర్డినేటర్‌ రమణ, తదితరులు వారి వెంట ఉన్నారు.