May 16,2023 15:11

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం మండలం గర్వించదగ్గ విషయమని ఉండ్రాజవరం మండల పరిషత్‌ అధ్యక్షురాలు పాలాటి యల్లారీశ్వరి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగిన ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలలో ఉత్తీర్ణత శాతం భారీగా పెరగాలన్నారు. మండలంలోని ఎనిమిది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఎస్‌ ఎస్‌ సి 2023 పరీక్షా ఫలితాలలో అంబటి మాధురి 576, కాజ జ్యోతి 572, తీట్ల సలోమీ 572, మాదిరెడ్డి వెంకటేష్‌ 568, ఎంబిడి శిరీష 568 మార్కులతో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని మండల విద్యాశాఖ అధికారి పీవీఎస్‌ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సుధాకర్‌, శరత్‌ బాబు ఎంపీడీవో ఏ శ్రీనివాసు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.