ప్రజాశక్తి -కోరుకొండ(తూర్పుగోదావరి) : 12ఎకరాలలో సాగుచేస్తున్న వరిపంట విద్యుత్ సరఫరా లేక ఎండిపోతున్నాయని, తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతులు వాపోతున్నారు. కోరుకొండలో శుక్రవారం జరుగుతున్న వ్యవసాయ సలహామండలి సమావేశానికి కోటికేశవరం, బల్లెద్దుపాలెం గ్రామ రైతులు వచ్చి తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపధ్యంలో కోటికేశవరం గ్రామానికి చెందిన కౌలు రైతు పీతల వెంకటరావు పురుగుమందు డబ్బాతో వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానని, తొమ్మిది గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా జరగడంలేదన్నారు. కేవలం మూడునాలుగు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరగడంతో పంటలు ఎండిపోతున్నాయని వివరించారు. ఇప్పటికే నాలుగు ఎకరాలు పూర్తిగా ఎండిపోయిందని, మిగిలిన పంట చేతికిరాకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడికి రావలసివచ్చిందని తెలిపాడు.సమస్యను విద్యుత్ అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని వ్యవసాయ మండలి ఛైర్మన్ కె సర్రాజు హామీ ఇచ్చి రైతులకు సర్దిచెప్పారు.










