ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం ఒకటవ డివిజన్ పరిధిలో ఉన్న అయ్యప్పనగర్ స్వామీ లే అవుట్ లో ఉన్న అక్రమ వాటర్ ప్లాంట్ లను వెంటనే సీజ్ చేయాలని విజయనగరం భూ గర్భ జల వనరులు శాఖా అధికారి దుర్గా ప్రసాద్‌ని శుక్రవారం కలిసి వినతిపత్రం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు సమర్పించారు. ఈ సందర్భంగా... విజయనగరం అపార్ట్‌మెంట్లు కాలనీస్ అసోసియేషన్ నాయకులు, యుఎస్.రవి కుమార్, విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యాదర్శి రెడ్డి శంకరరావు లు మాట్లాడుతూ ... జనావాసాల మధ్య వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయకూడదు అన్నది ప్రభుత్వ విధానమన్నారు. ఒక వేళ ఎవ్వరైనా అధికారులని మభ్య పెట్టి, లేదా రాజకీయ పలుకబడితో నో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన అది అక్రమమే అవుతుందని... ఎందుకంటే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వారు 5 హెచ్ పీ లేదా ఆ పైన మోటారు వాడతారని అన్నారు. 500 అడుగులు ఆపైన లోతులో బోరు తవ్వి నీరును అమ్ముకుంటారని... అంటే 500 అడుగుల లోపు ఉన్న మోటార్లన్ని వేసవిలో ఎండిపోయాయని అన్నారు. వెంటనే అధికారులు కలుగచేసుకుని అయ్యప్ప నగర్ స్వామి లేఅవుట్ లో ఉన్న అక్రమ వాటర్ ప్లాంట్ లను రద్ధు చేయాలని కోరారు. దీనిపై భూ గర్భ జల వనరుల శాఖా అధికారి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ... రికార్డ్ లు వెరిఫై చేశామన్నారు. తమ డిపార్ట్ మెంట్ నుండి అయ్యప్ప నగర్ స్వామీ లే అవుట్ లో ఏ ఒక్క వాటర్ ప్లాంటుకి అనుమతి ఇవ్వలేదని ఆన్నారు. తాము అనుమతి ఇవ్వకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అనుమతి ఇవ్వబోదని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న వాటర్ ప్లాంట్ లు అక్రమమేనన్నారు. అయితే సీజ్ చేసే అధికారం తమదికాదని అది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేయాలని, తాము దర్యాప్తు చేసి రిపోర్ట్ పంపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్, తదితరులు పాల్గొన్నారు.










