Aug 20,2023 23:32

వేమగిరి లేఅవుట్‌లో మెరక పనుల దశలోనే ఉన్న లేఅవుట్‌

సర్కారు సాయం చాలక సాగని నిర్మాణాలు
నాలుగేళ్లయినా పూర్తిగాని జగనన్న కాలనీలు
ప్రారంభోత్సవం కోసం హడావుడిగా తొలిదశ పనులు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : జగనన్న కాలనీ లబ్ధిదారుల్లో ఇల్లు నిర్మించలేక నిరాశ గూడు కట్టుకుంటుంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాలుగేళ్లకు ఎట్టకేలకు మొదటి దశ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలస్యానికి ప్రభుత్వ అలసత్వమే కారణమని లబ్ధిదారులు చెబుతున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకుంటామంటూ ప్రభుత్వం బెదిరించటంతో కొందరు అప్పులు తెచ్చి నిర్మాణాలను పూర్తి చేశారు. మరికొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఎట్టకేలకు నిర్మాణాలను పూర్తి చేశారు. జిల్లాలో 'జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ప్రభుత్వం 68,074 ఇళ్ల స్థలాలను ఏడు నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు మంజూరు చేసింది. కొన్ని కాలనీలు నిర్మాణానికి అనువుగా లేకపోవడంతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు బేస్‌మెంట్‌ స్థాయి కూడా దాటనివి 28,333 ఉన్నాయి. ఇక బేస్‌మెంట్‌ లెవెల్‌ వరకు వచ్చిన నిర్మాణాలు 10, 286 ఉన్నాయి. రూఫ్‌ లెవెల్‌ వచ్చినవి 2,059 కాగా ఇక అసలు మొదలుపెట్టని ఇంటి నిర్మాణాలు 418 ఉన్నాయి. పూర్తయిన ఇళ్లు20,237 మాత్రమే. దాదాపు 48,677 ఇళ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.
ఎట్టకేలకు తొలిదశ లక్ష్యం పూర్తి
జిల్లాలో ఎట్టకేలకు తొలి దశ లక్ష్యం పూర్తయింది. తొలి దశ లక్ష్యం 20,521 కాగా 20,237 పూర్తయ్యాయి. మిగిలిన 284 ఇళ్లురోజుల వ్యవధిలోనే పూర్తి కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లో లక్ష మందికి పైగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు మొదట మూడు ఆప్షన్లు ఇచ్చింది. లబ్ధిదారులు నిర్మించుకుంటే నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తామని చెప్పింది. అవి సరిపోవని లబ్ధిదారులు వ్యతిరేకించడంతో డ్వాక్రా రుణాల ద్వారా మరో రూ.30 వేలు ఇవ్వడానికి నిర్ణయించింది. మొత్తం కలిపి రూ.2.10 లక్షలు అవుతున్నాయి. అయితే పెరిగిన స్టీలు, సిమెంటు, ఇసుక, కూలీల ఖర్చులతో లబ్ధిదారులకు నిర్మాణ భారం తడిచి మోపెడవుతోంది. బేస్‌మెంట్‌ లెవెల్‌ పూర్తి చేయడానికే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పావు వంతు కూడా ఇంటి నిర్మాణం పూర్తి కాదు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే అదనపు ఖర్చును బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుండగా బ్యాంకులు మాత్రం నిబంధనల పేరుతో లబ్ధిదారులకు చుక్కలు చూపుతున్నాయి.
సామూహిక గృహ ప్రవేశాలకు కసరత్తు
జగనన్న లే అవుట్‌ లలో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు మార్లు వాయిదాలు వేయటంతో విమర్శలు వెలువెత్తాయి. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి కార్యక్రమంగా కాపవరం ల-ేఅవుట్‌లో నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల హౌసింగ్‌ సిఇ జివి,ప్రసాద్‌ పర్యటించారు. కలెక్టర్‌ అధ్యక్షతన హౌసింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. జగనన్న కాలనీలలో దళారులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తంలోనే ఇల్లు పూర్తిగా నిర్మిస్తామంటూ దళారులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఆచరణలో రెండేళ్లు గడిచినా నిర్మాణాలను పూర్తి చేయలేదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇల్లు కట్టుకునే స్థోమత లేక పోవటంతో దళారులను ఆశ్రయించామని చెబుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని అక్రమార్కులకు కళ్లెం వేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.